
రైతు బీమా మార్గదర్శకాలు జారీ
● రైతులు ఏఈఓలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి ● ఈ నెల 13వ తేదీ వరకు గడువు విధించిన అధికారులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతు బీమా పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుండగా, సహజ లేదా ఏ కారణంచేతనైనా పట్టాభూమి కలిగిన రైతు మృతి చెందితే నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతులు ఈ పథకాన్ని వర్తింపజేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఈనెల 13 లోగా బీమా పథకానికి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా పేరు నమోదు చేసుకునే వారు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం/ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు సమర్పించాలని వివరించారు.
2025–26 సంవత్సరానికి మార్గదర్శకాలు..
● 2025 జూన్ 5వ తేదీలోగా భూభారతి చట్టం ప్రకారం పట్టాలు కలిగినవారు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగినవారు అర్హులు.
● 18 నుంచి 59 సంవత్సరాలు అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించి ఉండాలి.
● ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు.
● కొత్త పట్టాదారులు, గతంలో నమోదు కాకుండా ఉండి ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులు, ఐదెకరాలకు మించి భూమి ఉండి గతంలో నమోదుకాని రైతులు ఈ నెల 13వ తేదీ వరకు వ్యవసాయ అధికారులతో పరిశీలన చేయించుకోవాలి.
● అర్హత కలిగి గతంలో ఐడీ వచ్చిన రైతులను రెన్యువల్ చేసేందుకు ఈ నెల 12వ తేదీతో గడువు ముగియనుంది.
● రైతులు డాక్యుమెంట్ కాపీలు, నామినీ వివరాలతో సహా రైతు బీమా పత్రంపై స్వయంగా సంతకంతో ధ్రువీకరించాలి
● వివరాలు నమోదులో పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్, నామినీ ఆధార్, మొబైల్ నంబరు తప్పులు లేకుండా చూసుకోవాలి.
● భౌతికంగా నామినేషన్/దరఖాస్తు ఫారం ధ్రువపత్రాలతో అందజేసినా పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తేనే అర్హులు అవుతారు.
● ఏఈఓ నమోదు చేసిన వివరాలు మండల వ్యవసాయాధికారి లాగిన్‌కు వస్తాయి. ఏఓ పరిశీలించి ధ్రువీకరించాలి. ఆపై ఏడీఏ పర్యవేక్షించాలి. సూచించిన గడువు లోగా నమోదు పూర్తి చేసేలా ఏడీఏ రోజువారీగా సమీక్షించాలి.
● రైతుబీమాలో నమోదుకాని రైతులకు సంబంధించి ఏఈఓ తప్పనిసరిగా కారణాన్ని రికార్డు చేయాలి.
● ఆధార్, పుట్టిన తేదీ పీపీబీ నంబరు, నామినీ వివరాలతో నమోదైన రైతుల వివరాలను రైతు వేదికలో ప్రదర్శించాలి