
సింగరేణికి రూ.450 కోట్ల నష్టం..
● ఎక్స్‌ప్లోజివ్ టెండర్లలో అక్రమాలు ● విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఎక్స్‌ప్లోజివ్స్ కోసం వేసిన టెండర్లలో కంపెనీకి రూ. 450 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో రూ. కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కిందిస్థాయి ఉద్యోగులను బదిలీచేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నా సింగరేణి విజిలెన్స్ కుంభకోణాలకు పాల్పడుతున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. 1/70 యాక్ట్ పరిధిలో ఉన్న కోయగూడెం ఓసీ, గోదావరిఖనిలోని తాడిచెర్ల, భూపాలపల్లిలోని వెంకటాపుర్ ఓసీ, సత్తుపల్లి ఓసీ–3లలో బొగ్గును ప్రైవేట్ కంపెనీలతో బొగ్గు తవ్వించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. సింగరేణి సంస్థే ఆ ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. స్ట్రక్చరల్ సమావేశంలో అంగీకరించిన కార్మిక సమస్యలపై సర్క్యులర్‌లు విడుదల చేయాలని కోరారు. మైనింగ్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగులు అండర్ గ్రౌండ్ అన్‌ఫిట్ అయితే సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలన్నారు. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. జూలై 30,31 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డ్‌కు హాజరైన 47 మందికి మళ్లీ మెడికల్ బోర్డ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కో, జెన్కోలు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్లు చెల్లించాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికులకు 200 గజాల స్థలం, రూ. 30 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరస్వామి, రమణ మూర్తి, క్రిస్టోఫర్, కత్తర్ల రాములు, సందెబోయిన శ్రీనివాస్, హుమాయిన్, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.