ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 19 వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులక సూచించార. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు, డిజిటల్ విద్య, ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. 6 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి తిరిగి పాఠశాలకు పంపించాలని, పిల్లలను బడికి పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలను నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి, రెండు వారాల్లో తగిన మరమ్మతులు చేయించాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం ద్వారా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహారీలు నిర్మించాలని, భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాసం యాప్ ద్వారా వారికి అభ్యాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 100 శాతం అక్ష్యరాస్యత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్‌ల ఆధ్వర్యంలో సీడ్ బ్యాంకుల ద్వారా విత్తనాలు ఎక్కువగా సేకరించిన స్కూళ్లకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తులసి, ఉసిరి, చింత, వెలగ, మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్, డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.


