అవతరణ వేళ.. జీసీసీ వెలవెల
పాల్వంచరూరల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. కానీ పాల్వంచ జీసీసీ కార్యాలయం మాత్రం వెలవెలబోయింది. జీసీ బీఎం గది తలుపులు మూసి బయట గడియపెట్టారు. మరో అధికారి గదికి ఏకంగా తాళం వేసి వెళ్లిపోయారు. సంబంధిత అధికారులతో అవసరం ఉన్న గిరిజనులు వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి రాగా ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. జీసీసీ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మోజీ గత నెల 31న ఉద్యోగ విరమణ పొందగా, భద్రాచలం డీఎంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన భద్రాచలంలో ఉండటంతో ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా అధికారులు, సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇన్‌చార్జి డీఎం సమ్మయ్యను వివరణ కోరగా.. జెండా ఆవిష్కరణ అనంతరం సిబ్బంది బయటకు వెళ్లి ఉంటారని తెలిపారు.
తలుపు, తాళం వేసి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అధికారులు
అవతరణ వేళ.. జీసీసీ వెలవెల


