హెచ్‌ఆర్‌ఎస్ ఏఈఓకు ఉత్తమ అవార్డు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్‌ఆర్‌ఎస్)లో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎండీ హుస్సేన్‌కు ఉత్తమ క్షేత్రస్థాయి అవార్డు దక్కింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులో నిర్వహించిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చేతుల మీదుగా ఆయన అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. హుస్సేన్‌ను తోటి ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.
పర్యావరణ
సెమినార్‌కు ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన పర్యావరణవేత్త, న్యాయవాది పామరాజు తిరుమలరావుకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీలో ‘ఫోరమ్ ఫర్ ఎన్విరాన్‌మెంట్’ ఆధ్వర్యంలో జరగనున్న సెమినార్‌లో ప్రసంగించాల్సిందిగా ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్. హనుమంతరావు బుధవారం తిరుమలరావుకు ఆహ్వానం పంపారు. గ్రీన్ భద్రాద్రి కో–ఆర్డినేటర్‌గా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం తదితరులు తిరుమలరావుకు అభినందనలు తెలిపారు.
అధునాతన సౌకర్యాలతో ‘సూపర్’ఫాస్ట్ రైలు
అశ్వాపురం: మణుగూరు – సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ రైలు అధునాతన సౌకర్యాలతో బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్ రైలు ముందుగా మణుగూరు చేరుకుని, ఆ తర్వాత ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లింది. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ భద్రత, గరిష్ట వేగం 200 కి.మీ.తో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఎయిర్ సస్పెన్షన్ సిస్టం, విశాలమైన కిటికీలు, కొత్త సీట్లతో రూపొందించారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు
సత్వర న్యాయం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం తన చాంబర్‌లో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం 34 అండర్ ఇన్వెస్టిగేషన్ అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ప్రతీ కేసును పారదర్శకంగా, నిబంధనల మేరకు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. అత్యాచారానికి గురైన మహిళలకు భరోసా కల్పించేందుకు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయం, మానసిక ధైర్యం అందేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చట్టపరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి శ్రీలత, వివిధ శాఖల అధికారులు హనుమంతరావు, ప్రసాద్, కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ఎస్ ఏఈఓకు ఉత్తమ అవార్డు
హెచ్‌ఆర్‌ఎస్ ఏఈఓకు ఉత్తమ అవార్డు


