ఎత్తిపోతలకు గ్రహణం
నిరుపయోగంగా ‘తుమ్మల’
మరమ్మతులకు నోచుకోని లిఫ్ట్ ఇరిగేషన్లు
నీరున్నా ఉపయోగించుకోలేని దుస్థితి
యాసంగి సాగుకు దూరమవుతున్న రైతులు
బూర్గంపాడు: ఎత్తిపోతల పథకాలకు నిధుల గ్రహణం వీడడం లేదు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను గాలికొదిలేశాయి. వాటి మోటార్లు, పైప్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, నదులు, చెక్‌డ్యామ్‌ల్లో నీరు అందుబాటులో ఉన్నా.. ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురి కావడంతో యాసంగికి సాగునీరు అందే పరిస్థితి లేదు. పినపాక నియోజకవర్గంలోని పలు లిఫ్ట్ ఇరిగేషన్‌లు పనిచేయకపోవడంతో రైతులు యాసంగి పంటల సాగుకు దూరమవుతున్నారు.
మూలనపడిన ‘మోతె’..
కరకగూడెం మండలం మోతె గ్రామంలో రూ.11 కోట్లతో పెద్దవాగుపై 2014లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం మూలనపడింది. పెద్దవాగు నీటిని వృథా చేయకుండా మండల పరిధిలోని ఎనిమిది చెరువులకు పైప్‌లైన్లతో తరలించేలా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. తొలుత 1,023 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రారంభించి దశలవారీగా విస్తరించారు. ఈ స్కీమ్‌కు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ రెండేళ్ల క్రితం చోరీకి గురైంది. దీనికి తోడు నిర్వహణ లోపంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంప్‌హౌస్ చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్ ఇసుకతో పూడుకుపోయింది.
రైతుల నిధులతోనే..
పినపాక మండలంలోని టీ కొత్తగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆయకట్టు రైతులు రూ.18 లక్షలు పోగుచేసి రిపేర్ చేయించారు. ఆ తర్వాత విద్యుత్ మోటార్లు, కాపర్ వైరు చోరీకి గురై ఈ పథకం పూర్తిగా మూలన పడింది. సింగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం కూడా మరమ్మతుల కారణంగా పని చేయడం లేదు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సీతారామ కాల్వల తవ్వకంతో మూలనపడింది. బూర్గంపాడు మండలం సోంపల్లి, బుడ్డగూడెం పథకాలు కూడా మరమ్మతులకు గురయ్యాయి. సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు పాలకులు చెబుతున్నా.. ఈ లిఫ్ట్‌లను మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేయించి తమకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు.
బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలోని తుమ్మల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. 2002లో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3.06 కోట్లతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. దీని పరిధిలో 733 మంది రైతులకు చెందిన రెండువేల ఎకరాలకు సాగునీరు అందగా రెండు పంటలు సాగు చేసేవారు. 200 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు, 100 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లతో సాగునీరు అందేది. ప్రస్తుతం మోటార్లు కాలిపోగా ఒకటి బాగానే ఉన్నా.. దాన్ని కూడా నడపడం లేదు. దీంతో రైతులకు సాగునీరు అందడం లేదు. ఇక పైప్‌లైన్లు కూడా మరమ్మతులకు గురై నీరు లీకవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలని రైతులు మూడేళ్లుగా కోరుతున్నా ప్రయోజనం లేదు.


