నేల చదును పనులు అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని విజయలక్ష్మినగర్ శివారులో వ్యవసాయ భూమిలో సింగరేణి చేపట్టిన నేల చదును పనులను స్థానిక గిరిజనులు గురువారం అడ్డుకున్నారు. జేకే ఓసీ నిర్వాసిత ప్రాంతంగా గుర్తించిన తమ వ్యవసాయ భూమికి పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. యంత్రాలకు అడ్డుగా కూర్చొని నిరసన తెలపడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సర్వే నంబర్ 588/2 పరిధిలోని 7.03 ఎకరాల్లో సింగరేణి, అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారని, పరిహారం చెల్లిస్తామని ఆర్‌ఓఎఫ్‌ఆర్ గ్రామసభలో అప్పటి ఆర్డీఓ స్వర్ణలత ప్రకటించారని గుర్తుచేశారు. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తేజావత్ లాలు, ఎట్టి హరికృష్ణ, ధనసరి రాజు, వడ్ల శ్రీను, స్థానిక రైతులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారులతో నిర్వాసితుల వాగ్వాదం


