కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచరూరల్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి, పాల్వంచ మండలం రెడ్డిగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫర శాఖ అధికారులతో కలిసి సందర్శించి, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, టెంట్, తూకపు, తేమ యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యంను కేటాయించిన మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్‌బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


