
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇన్సులిన్ కొరతపై
కలెక్టర్ ఆరా !
డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌ను
వివరణ కోరిన పాటిల్
ఇల్లెందు : మధుమేహ బాధితులకు అందించే ఇన్సులిన్ మందు కొరతపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆరా తీశారు. సోమవారం సాక్షిలో ‘ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, ఇందుకు గల కారణాలపై డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌ను వివరణ కోరినట్లు తెలిసింది. జిల్లాలో 5,12,321 మందికి ఎన్‌సీడీ పరీక్షలు నిర్వహించగా 44,306 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 20,160 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాయకల్ప ఆస్పత్రుల్లో సుమారు 1000 వాయిల్స్ ఉన్నా.. వాటి కాల పరిమితి జూన్‌తో ముగుస్తోంది. కనీసం మూడు నెలల గడువు ఉన్న మందులనే వాడాల్సి ఉండడంతో ఆ వాయిల్స్‌ను పక్కన పెట్టారు. రెండు నెలల గడువున్నా వాడొచ్చని డాక్టర్లు నిర్ధారిస్తే.. అవసరాన్ని బట్టి వాటిని ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న నిధులతో అవసరమైన మందులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా.. కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఏదేమైనా ఇన్సులిన్‌తో పాటు బీపీ బాధితులు వాడే ఒక రకం మాత్రలు సైతం అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు.
నాణ్యమైన విద్యుత్
సరఫరాకు చర్యలు
కొత్తగూడెంఅర్బన్ : వేసవిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఈ జి.మహేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గత నవంబర్‌లోనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. విద్యుత్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న గుండాల, మామకన్ను, ఆళ్లపల్లి, చర్ల మండలం సత్యనారాయణపురం 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పాల్వంచ, దమ్మపేట మండలం మల్కారం, అంకంపాలెం, లింగాలపల్లి, అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 288 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 52 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు. తద్వారా ఓవర్ లోడ్ ఇబ్బంది లేకుండా చేయగలిగామని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, బొమ్మనపల్లి, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు మండలాల్లో ఓవర్ లోడ్ తగ్గించగలిగామని వివరించారు.