
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
దాడికి నిరసనగా శ్రీరామస్తోత్ర పారాయణం
కశ్మీర్‌లోని పెహల్‌గాం ప్రాంతంలో జరిగిన దాడికి నిరసనగా శనివారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బేడా మండపంలో శ్రీరామస్తోత్ర పారాయణం గావించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుతూ పూజలు చేశారు.
వైభవంగా రుద్ర హోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా శనివారం రుద్రహోమం జరిపించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన అర్చకులు.. మండపారాధన, గణపతి పూజ చేశారు. ఆ తర్వాత రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనిత్రయోదశిని పురస్కరించుకుని శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారు.