ఆఫ్‌టైప్ మొక్కల పరిశీలన
దమ్మపేట: మండలంలోని జగ్గారం గ్రామ పరిధిలోని రైతుల పామాయిల్ క్షేత్రాల్లో అంతగా దిగుబడి రాని ఆఫ్‌టైప్ మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఐఐఓపీఆర్ విశ్రాంత శాస్త్రవేత్త బీఎన్.రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జన్యులోపం, విత్తనలోపం, పెంపకంలో లోపాలు తదితర కారణాల వల్ల ఆఫ్‌టైప్, నాణ్యత లేని మొక్కలు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్త తెలిపారు. దిగుబడి లోపంపై పూర్తిస్థాయిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గాడ్రెజ్ కంపెనీ ద్వారా మొక్కలు తెచ్చి, సాగు చేసిన క్షేత్రాల్లో ఆఫ్‌టైప్ మొక్కలు రాలేదని, ఆయిల్ ఫెడ్ నర్సరీ మొక్కల్లోనే అధికంగా ఆఫ్‌టైప్ మొక్కలు వచ్చాయని, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని చైర్మన్‌ను కోరారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్‌రెడ్డి, డివిజనల్ నర్సరీ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు, ప్రవీణ్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు తుంబూరు ఉమామహేశ్వరరావు, కొక్కెరపాటి పుల్లయ్య, చెలికాని సూరిబాబు, కారం శ్రీరాములు, మడివి బాలరాజు పాల్గొన్నారు.


