
భూ భారతితో అందరికీ మేలు
● కొత్త చట్టంపై ఆందోళన వొద్దు ● కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడి
మణుగూరు టౌన్/అశ్వాపురం : భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చట్టంపై ఎలాంటి ఆందోళనలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. భూ బదలాయింపులో ప్రవేశపెట్టిన నిబంధనలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ధరణి కంటే భూ భారతి చట్టంతోనే భూములకు రక్షణ కలుగుతుందన్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారి సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసి, వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ చట్టం రైతులకు, ప్రజలకు మాత్రమే కాక రెవెన్యూ అధికారులకు కూడా ధైర్యం ఇచ్చిందని, సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగంచలతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ దామోదర్‌రావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణలత, ఏడీఏ తాతారావు, ఎంపీడీఓ వరప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్‌ఐ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
లంచం అడిగితే ఏసీబీకి పట్టించండి
అశ్వాపురంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుల సందేహాలు తెలపాలని కలెక్టర్ సూచించగా.. ఓ రైతు మాట్లాడుతూ గతంలో ధరణిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు లంచాలు తీసుకున్నారని, భూ భారతిలో ఎంత లంచాలు తీసుకుంటారని ప్రశ్నించాడు. డైరెక్ట్‌గా తీసుకుంటే ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారని గ్రామానికి ఓ బ్రోకర్ ద్వారా అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చాడు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. డబ్బు తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరమని అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు పట్టించండని చెప్పారు. బ్రోకర్ల ద్వారా తీసుకుంటే ఆధారాలతో తనకు తెలియజేస్తే పోలీసు కేసు పెడతానని చెప్పగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.