యంత్రం.. పాత మంత్రం
వ్యవసాయ యాంత్రీకరణను పునరుద్ధరించిన ప్రభుత్వం
● గత మార్చిలో పథకం విధివిధానాల వెల్లడి ● మళ్లీ పాత తరహా యంత్రాలకే సబ్సిడీల ప్రకటన ● ప్రస్తుత పరిస్థితులకు తగిన కొత్త పరికరాలకు దక్కని చోటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(స్మామ్) పథకంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. ఇతర రైతులకు ఈ సబ్సిడీ 40 శాతం ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల విలువైన యంత్రాలను అందించే వీలుంది. గతంలోనూ ఈ పథకం అమల్లో ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టాక నిలిపివేసింది. దీంతో వ్యవసాయ యాంత్రీకరణలో వేగం తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించింది. కానీ డ్రోన్లు మినహాయిస్తే ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆధునిక యంత్రాలకు చోటు కల్పించకపోవడం లోటుగా మారింది.
మారిన అవసరాలు
గడిచిన ఐదారేళ్లుగా తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరిగింది. గతేడాది నుంచి సన్న రకాలు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. సాధారణంగా కోతలు పూర్తయ్యాక ధాన్యంలో తేమ 35 నుంచి 40 శాతం ఉంటుంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే తేమ 17శాతమే ఉండాలి. దీంతో ఆరబెట్టేందుకు ఆధునిక యంత్రాలు (ప్యాడీ డ్రయర్స్) అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇప్పటికీ పాత పద్ధతులే అవలంబించాల్సి వస్తోంది.
కొత్త వాటికి చోటివ్వాలి
ప్రస్తుతం వ్యవసాయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్ల వంటి యంత్రాల వినియోగం దాదాపు సంతృప్త స్థాయికి చేరింది. తిరిగి ఇవే యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ఆరబోత, కోత యంత్రాల అవసరం పెరిగింది. మిర్చి, పత్తి కోతల సమయంలో స్థానికంగా కూలీలు పొరుగు రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆధునిక యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు తగ్గట్టు నిబంధనల్లో మార్పు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాలు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైనవి అందుబాటులో ఉన్నాయి. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండే ధాన్యాన్ని ఆరబెట్టడంతోపాటు తాలు కూడా ఇవి వేరు చేస్తాయి. తద్వారా రోజుల తరబడి ఆరబోయాల్సిన ఇక్కట్లు తప్పుతాయి. అదే విధంగా మిర్చి, పత్తి కోత మిషన్ల అవసరం ఉన్నందున రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది.
ఆఖరికి శ్మశానంలోనూ
ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు గ్రామాల్లో ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, పాఠశాలలు, మైదానాలు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆరబెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎక్కడా చోటు లభించక వైకుంఠ ధామా(శ్మశాన వాటిక)ల్లోనూ ధాన్యం ఆరబోసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా పగలూరాత్రి, ఎండావానా తేడా లేకుండా కాపలా ఉంటున్నారు. పగటి వేళ కూలీలను పెట్టుకుని అరగంటకోసారి ధాన్యాన్ని నేరుపుతూ తేమ తగ్గించేందుకు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. కనీసం వారం పాటు జరిగే ఈ తంతు కారణంగా అయ్యే ఖర్చు, ప్రభుత్వం అందించే బోనస్‌కు సరిపోతోంది. దీంతో చాలామంది సన్నకారు, చిన్నకారు రైతులు మద్దతు ధర రాకున్నా పొలాల వద్ద ప్రైవేట్ వ్యాపారులకు పచ్చి ధాన్యమే అమ్ముకుంటున్నారు. ఫలితంగా బోనస్ చాలా మంది సన్నకారు, చిన్నకారు రైతులకు అందడం లేదు.
యంత్రం.. పాత మంత్రం


