
ఆ ఊరికి రామయ్యస్వామే రుణదాత
● ఏడాదిలోగా వడ్డీతో సహా అప్పు చెల్లిస్తున్న గ్రామస్తులు ● అశ్వాపురం ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
అశ్వాపురం: సాధారణంగా ఏదైనా అవసరం వస్తే ఇతరుల వద్ద అప్పు తీసుకుంటారు. కానీ ఆ గ్రామంలో ప్రతీ ఒక్కరు దేవుడి వద్దే అప్పు తీసుకుంటున్నారు. తిరిగి ఏడాదిలోగా వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2004లో శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో హోమం, యాగాలు నిర్వహించాక గ్రామస్తులు సేకరించిన నగదులో రూ. 15 వేలు మిగిలాయి. ఆలయ అభివృద్ధికి మరో రెండు సంస్థలు రూ.25 వేల చొప్పున రూ. 50 వేలు విరాళం ఇచ్చాయి. మొత్తం రూ. 65 వేలు కాగా, ఆ నగదును ఎక్కడా ఖర్చు చేయకుండా గ్రామస్తులకు రుణం ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఒక్కరికి రూ.6 వేల వరకు రుణం ఇవ్వాలని, తీసుకున్న అప్పు ఏడాదిలోపు చెల్లించాలని, రుణానికి ఆ గ్రామంలోనివారే అర్హులని నిబంధనలు పెట్టుకున్నారు. అప్పటి నుంచి గ్రామస్తులు అప్పు తీసుకుంటూ, తిరిగి చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం స్వామివారికి గ్రామస్తులు రూ.20.90 లక్షల వరకు అప్పు ఉన్నారని ఆలయ కమిటీ వారు చెబుతున్నారు. సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకుని ప్రారంభిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. కాగా గ్రామంలో రామాలయం నిర్మించాలనుకున్న స్థలంలో ఏటా పందిరి మండపం ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహిస్తున్నారు.