
7.63 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: ఏపీలోని చింతూరు నుంచి భద్రాచలం మీదుగా మధ్యప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.తిరుపతి కథనం ప్రకారం.. కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 7.63 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తిని విచారించగా మధ్యప్రదేశ్‌కు చెందిన బ్రిజేష్ ఏపీలోని చింతూరులో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొని మధ్యప్రదేశ్‌లోని విదిశాకు బైక్‌పై తరలిస్తున్నట్లు చెప్పాడు. ఈమేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని, గంజాయి విలువ సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
10 లీటర్ల నాటుసారా..
బూర్గంపాడుకు చెందిన గుండె రాజేష్, రేపాకుల సంతోష్‌లు ద్విచక్ర వాహనంపై 10 లీటర్ల నాటుసారాను సారపాకకు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది కరీం, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత?
అశ్వారావుపేట: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న నిషేధిత గంజాయిని అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నార్కోటిక్ పోలీసులు పట్టకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఏపీ వైపు నుంచి ఖాళీగా వస్తున్న ఓ లారీలో టార్పాలిన్ పట్టా కింద సుమారు 400 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో దాడి చేయగా లారీ గంజాయితో సహా పట్టుబడినట్లు తెలిసింది. కాగా, ఇట్టి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. మధిరకు చెందిన రాజకొండ దుర్గారావు కొన్నేళ్లుగా బొక్కలగడ్డ వెంకటేశ్వర్‌నగర్‌లో ఉంటూ చిరువ్యాపారం చేస్తున్నాడు. అయితే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈనేపథ్యాన పెట్రోలింగ్ చేస్తున్న ఎస్‌ఐ రమేష్ ఆయనన తనిఖీ చేయడంతో రూ.20వేల విలువైన 450 గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.