
హామీపై గప్‌చుప్!
● ఇల్లెందుకు సీతారామ నీరందించాలనికోరుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి ● గత నెల 18న రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించిన నర్సయ్య ● వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం ● నేటికి నెల రోజులైనా పురోగతి శూన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు ఇచ్చే విషయంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడిచినా ఈ అంశంపై పురోగతి లేదు.
సీఎంకు గుమ్మడి వినతి..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా గత నెల 18న సీఎం రేవంత్‌రెడ్డిని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిసి, ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ద్వారా గోదావరి నీరు అందించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఇల్లెందుపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలను ఆహ్వానించాలని సూచించారు. గతంలో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. ఎలా చేస్తే ఇల్లెందు ప్రజలకు మేలు అనే అంశాలపై చర్చించి న్యాయం చేయాలని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ త్వరలోనే ఇల్లెందు సమస్యపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఇల్లెందుకు అదనపు ప్రణాళిక..
సీతారామ ప్రాజెక్టులో ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి అదనపు ప్రణాళికను 2023 వేసవిలో జలవనరుల శాఖ సిద్ధం చేసింది. దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిఽధిలో కొత్తగా 1,13,287 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ అంచనా వ్యయం రూ. 3,200 కోట్లు. ఇందులో కొత్త పంపుహౌస్‌లు నిర్మించడంతో పాటు బయ్యారం చెరువు మత్తడిని 16 అడుగుల నుంచి 19 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. తద్వారా మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల్లోని పొలాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు.
పునాది పడింది ఇక్కడే..
సీతారామ ప్రాజెక్టుకు 2016లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తొలి ప్లాన్‌లో ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు గోదావరి జలాలు పారించాలని నిర్ణయించారు. అయితే గోదావరి నుంచి రోళ్లపాడు వరకు నీటిని తరలించే కెనాల్ మార్గంలో కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అనుమతుల సాధన సాధ్యం కాదంటూ ఈ ప్లాన్‌లో మార్పులు చేశారు. ఇలా సీతారామ ద్వారా లబ్ధి పొందే నియోజకవర్గాల జాబితా నుంచి ఇల్లెందు (కామేపల్లి మండలం మినహా) కనుమరుగైంది. దీంతో సీతారామతో ఇల్లెందు నియోజకవర్గానికి న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా జిల్లాతో పాటు గార్ల, బయ్యారం మండలాల ప్రజలు పోరాటం చేస్తున్నారు.
పిలుపు కోసం ఎదురుచూస్తున్నా
ఇల్లెందుకు గోదావరి నీళ్లు ఇచ్చే అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించే సమావేశానికి పిలుపు ఎప్పుడొస్తుందా అని ప్రతీరోజు ఎదురుచూస్తున్నా. ప్రాజెక్టుకు సంబంఽధించి మీడియాలో వస్తున్న ప్రతీ విషయాన్ని ఆసక్తిగా తెలుసుకుంటున్నా. ఇల్లెందుకు న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం.
– గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే
నెలయినా కదలిక లేదు..
సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చి నేటికి నెల రోజులైనా ఎలాంటి పురోగతి లేదు. ఈ అంశంపై గుమ్మడి నర్సయ్యకు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలకు కానీ ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు సమావేశం నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఇంకా సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అనుమతులు రాలేదు. ఈ అంశంపై కేంద్ర జల సంఘం ఈనెల 24న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. అప్పటివరకై నా ఇల్లెందు ప్లాన్‌పై చర్చించి సీతారామ డీపీఆర్‌లో చేర్చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.