● జెన్‌కోలో పైరవీలు చేసేవారికి పోస్టింగ్‌లు.. ● గతానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ● ప్రత్యేక సీఎండీ లేక పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు ● రాష్ట్రంలోని మూడు సీఈ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లే..
పాల్వంచ: టీఎస్ జెన్‌కోలో పనిచేస్తున్న ఇంజనీర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోతున్నాయి. యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని ఇంజనీర్లు, సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థ పురోభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న ఇంజనీర్లపై వివక్ష చూపిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోతున్నారు. పదోన్నతులతో పాటే బదిలీలు చేపట్టాల్సి ఉండగా పదోన్నతులు వచ్చి నెలలు గడుస్తున్నా పోస్టింగ్ లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, యాజమాన్యాలకు కలిసి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పైరవీలు చేసుకుంటున్న వారు మాత్రం మంచి పోస్టింగ్‌లు పొందుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
సీఎండీ ఉండాలి..
జెన్‌కోకు ప్రత్యేక సీఎండీ లేకపోవడం ఇంజనీర్ల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ఎనర్జీ, పంచాయతీ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అధికారే జెన్‌కో సీఎండీగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన ఈ శాఖ సమస్యలపై సరిగ్గా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజనీర్ల సమస్యలపై ఇంజనీర్ల సంఘాలు ఇప్పటికే అనేక మార్లు వినతిపత్రాలను సమర్పించారు. రేపు, ఆ తర్వాత కూడా విద్యుత్ శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రుల దృష్టికి ఇంజనీర్ల సమస్యలను తీసుకుపోనున్నారు. అయినా, సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
ఇన్‌చార్జ్‌లతో సీఈ పోస్టుల భర్తీ
జెన్‌కోలో మూడు చీఫ్ ఇంజనీర్ పోస్టులు సైతం ఇన్‌చార్జ్‌లతో నడుస్తుండటం గమనార్హం. పాల్వంచలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 7వ దశలో పనిచేసే చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు జనవరి 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో జెన్‌కో ట్రైనింగ్ సెంటర్ సీఈ శ్రీనివాసబాబు 7వ దశ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉండగా హైదరాబాద్ విద్యుత్ సౌధలో ఈఆర్‌సీ సీఈ టీఎస్‌ఎన్ మూర్తి సైతం జనవరి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఫిబ్రవరి 28న కమర్షియల్ సీఈ ఆనందం ఉద్యోగ విరమణ చెందారు. ముగ్గురు సీఈలు ఉద్యోగ విరమణ పొందినా ఇంకా ఆయా పోస్టుల్లో ఎవరినీ భర్తీ చేయలేదు. ఇతర సీనియార్టీ ఉన్న ఎస్‌ఈలకు కూడా పదోన్నతులు ఇవ్వలేదు.
వినతులు బుట్టదాఖలు
జెన్‌కోవ్యాప్తంగా గత అక్టోబర్ 14వ తేదీన 205 మంది ఇంజనీర్లు పదోన్నతులు పొందారు. ఇందులో ఏఈలు ఏడీఈలుగా, ఏడీఈలు డీఈలుగా, డీఈలు ఈఈలుగా, ఈఈలు ఎస్‌ఈలుగా పదోన్నతులు పొందారు. ఇక 2012 బ్యాచ్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు ఏడీలుగా పదోన్నతులు పొంది ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోస్టింగ్‌లు లభించలేదు. నాలుగేళ్లుగా జెన్‌కోలో ఇంజనీర్లకు ట్రాన్స్‌ఫర్లు కూడా ఇవ్వడం లేదు. రిటైర్‌మెంట్ ద్వారా ఖాళీ అయిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా వాటిని పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో పైరవీలు చేసుకుని కొందరు ఇంజనీర్లు బదిలీలు చేయించుకున్నారు. కాగా, అక్రమంగా విద్యుత్ సౌధకు ఇచ్చిన ట్రాన్స్‌ఫర్లను రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. విద్యుత్ సౌధకు బదిలీ కావాలంటే గతంలో సీనియార్టీ ప్రాతిపదికన మాత్రమే బదిలీలు జరిగేవి. కానీ, ఇటీవలికాలంలో పైరవీ ఉన్న వారికి పోస్టింగులు వస్తుండటం గమనార్హం.
ఇంజనీర్ల బదిలీలెప్పుడో..?