భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. భద్రాచలం దేవస్థానంలో శ్రీరామనవమి నవాహ్నిక వసంత ప్రయుక్త బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6, 7 తేదీల్లో శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది రామయ్య కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారనే ప్రచారం నేపథ్యంలో ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జి సెంటర్, అభయాంజనేయస్వామి పార్కు తదితర ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు సిద్ధం కాగా, మరికొన్ని చోట్ల పనులు నడుస్తున్నాయి. రెండో బ్రిడ్జి డివైడర్లకు, మిథిలా స్టేడియంలో కల్యాణ మండపానికి రంగులు వేస్తున్నారు. శాశ్వత స్వాగత ద్వారాల వద్ద గల విగ్రహాలకు ఇప్పటికే రంగులు అద్దారు. ఇక గ్రామపంచాయతీ, ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనులు వేగవంతం చేశారు. ఈనెల 30 నాటికి పూర్తి కావాలని ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా తాత్కాలిక మరుగుదొడ్లు, పట్టణంలో పారిశుద్ధ్య పనులు, స్టేడియంలో సెక్టార్ల విభజన, బారికేడ్ల నిర్మాణం వంటివి పెండింగ్‌లో ఉన్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
200 క్వింటాళ్ల తలంబ్రాలు..
ఈ ఏడాది భక్తుల కోసం 200 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇక స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారు చేయాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సరిపడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ముత్యాల తలంబ్రాలను కార్గో ద్వారా భక్తుల ఇంటికే చేరుస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించగా, పరోక్ష సేవల్లో భాగంగా తలంబ్రాలు, అర్చనలకు సంబంధించి ఈ నెల 31 వరకు తపాలా శాఖ అందించనుంది.
స్వాగత ద్వారాలు సిద్ధం
పూర్తి కావొస్తున్న పెయింటింగ్, ఇతర పనులు