● శ్రీరామనవమికి సీఎం రాక దాదాపు ఖరారు ! ● డెవలప్‌మెంట్ అథారిటీ ప్రస్తావనపై ఆశలు
భద్రాచలం: శ్రీరామనవమికి సీఎం హాజరు కావాలనే భద్రాచలం వాసుల కోరిక ఈ ఏడాది తీరనుంది. ‘నవమికి సీఎం సారొస్తార’ని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనికి తోడు కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆలయ ఈఓ, వైదిక కమిటీ ఆహ్వానించిన సమయంలో అభివృద్ధి, భూ సేకరణపై ఆయన అధికారులను ఆరా తీయడంతో దాదాపుగా సీఎం హాజరవుతారని ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు ఉన్నతాధికారులు సమర్పించే నివేదికలో సామాన్య భక్తులకు అందించాల్సిన వసతులు, డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, నిధుల మంజూరు వంటి అంశాలను కూడా పొందుపర్చాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
భూసేకరణపై ఆరాతో ఆశలు..
ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలుత మాఢ వీధుల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు భూ సేకరణకు అవసరమైన నిధులు కేటాయిస్తూ జీఓ విడుదల చేసింది. దీంతో ఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి భూ సర్వేతో పాటు ఇళ్ల స్థలాలు కోల్పోతున్న వారితో సంప్రదింపులు చేశారు. అయితే ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా భూ, ఇళ్ల నిర్వాసితులకు అందాల్సిన నిధులు మాత్రం విడుదల కాలేదు. కాగా ఆదివారం భద్రాచలం వచ్చిన మంత్రి పొంగులేటి కల్యాణానికి సీఎం వస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాఢ వీధుల విస్తరణ, అభివృద్ధి పనులకు కల్యాణం రోజునే ప్రారంభోత్సవం చేస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు నిర్వాసితులకు మూడు రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు కలిసినప్పుడు కూడా అభివృద్ధి పనులు, భూ సేకరణ వివరాలను ఆయన అడిగారు. పటిష్ట నివేదిక, ప్రణాళిక అందజేయాలని ఆదేశించారు. అయితే నష్టపరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది.
నివేదికలో ఇవి పొందుపరిస్తే మేలు..
భద్రాచలం ఆలయ అభివృద్ధికి అధికారులు అందజేసే నివేదికలో పట్టణ అభివృద్ధిపై సైతం పొందుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. వారి డిమాండ్‌లు ఇలా ఉన్నాయి.
●రామాలయ అభివృద్ధికి పటిష్ట మాస్టర్ ప్లాన్ రూపొందించాలి
●ఆలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు అసరమైన వసతులపై దృష్టి సారించాలి
●భక్తుల వసతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
●భద్రాచలంతో పాటు పర్ణశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
●అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలిపేలా స్పెషల్ కారిడార్ రూపొందించాలి
●ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి
●గోదావరి వరదల సమయంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలను ముంపు నుంచి తప్పించేందుకు కరకట్ట ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలి
●కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ప్రసాద్ పథక అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేలా సమన్వయం చేయాలి
●ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న రామయ్య భూముల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగేలా చర్యలు తీసుకోవాలి
●ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించాలి. తద్వారా భద్రాచలం అభివృద్ధికి అవసరమైన స్థల సమస్య తీరుతుంది.