సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయాలి

Mar 24 2025 2:12 AM | Updated on Mar 24 2025 2:13 AM

భద్రాచలంఅర్బన్‌: శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాచమ చంద్రస్వామివారి కల్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని చర్ల రోడ్డులో ఉన్న ఏఎంసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న 117 ఇందిరమ్మ ఇళ్లకు రూ.7.36 కోట్లతో మరమ్మతులకు చేయగా, మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఐటీడీఏ రోడ్డులోని మనుబోతుల చెరువులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన డీఆర్‌సీసీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎండ వేడి అధికంగా ఉన్నందున తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేయాలని, వైద్య సిబ్బంది అవసరమైన మందులు, అంబులెన్స్‌లో సిద్ధంగా ఉండాలని, అగ్నిపమాక సిబ్బంది ఫైర్‌ ఇంజన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో మద్యం షాపులు మూసి వేయించాలని ఎకై ్సజ్‌ అధికారులకు సూచించారు. శ్రీరామనవమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరవుతారని, మాడవీధుల విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ఘనత కాంగ్రెస్‌దే..

ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్‌దేనని మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇప్పటికే సీఎం రూ.387 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. గిరిజనులకు కూడా పక్కా ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. రామయ్య ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. అనంతరం ఐటీడీఏలో ఏర్పాటు చేస్తున్న మ్యుజియాన్ని సందర్శించారు. పెయింటింగ్‌ చిత్రాలు, పాతకాలపు ఇళ్లు, సెల్ఫీ పాయింట్‌ను ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్‌, ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.

భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలి

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలన, సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement