● పరీక్షల వేళ బస్సులు లేక విద్యార్థులకు తప్పని ఇక్కట్లు ● ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలే శరణ్యం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న తల్లిదండ్రులు
కొత్తగూడెంఅర్బన్/ములకలపల్లి : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆర్టీసీ బస్సులు సకాలంలో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించినా.. కార్యరూపం దాల్చడం లేదు. కొన్ని మారుమూల గ్రామాల వారు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే 10 నుంచి 15 కి.మీ.ప్రయాణించాలి. అయితే ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆటోలు, ఇతర వాహనాలకు డబ్బు చెల్లించలేని వారికి కాలినడకే శరణ్యం. అదే ఆర్టీసీ బస్సులు నడిపిస్తే బాలురు తక్కువ చార్జీతో, బాలికలు ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
జగన్నాథపురానికి కేటాయిస్తే..
ములకలపల్లిలోనే రెండు కేంద్రాలు కాకుండా ఒకటి జగన్నాథపురం హైస్కూల్‌లో ఏర్పాటుచేస్తే అక్కడి 25 మందికి సౌకర్యంతో పాటు కమలాపురం పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు కూడా ఏడు కి.మీ.లోపే ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు. వచ్చే ఏడాదైనా దీనిపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
బస్సులు నడపాలని కోరాం
పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సులు నడపాలని డీఈఓ ఆర్టీసీ అధికారులను కోరారు. మారుమూల గ్రామాల విద్యార్థులు పరీక్ష సమయానికి కొంత ముందుగానే ఇంటినుంచి బయలుదేరి సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలి. పరీక్ష సమయంలో ఆర్టీసీ అధికారులు కూడా చొరవ తీసుకుని విద్యార్థుల కోసం బస్సులు నడపాలి.
– మాధవరావు, జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి
పాల్వంచరూరల్ :పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు నడకయాతన తప్పేలా లేదు. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైట్ పరీక్ష కేంద్రానికి యానంబైల్ ఉన్నత పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. పాండురంగాపురం నుంచి 29 మంది విద్యార్థులు బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తోంది. ఆయా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రజావాణిలో విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు.
మండలాల్లో పరిస్థితి ఇలా..
ములకలపల్లి మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మండలంలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు పాఠశాల ఉండగా మొత్తం 249 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ములకలపల్లి జెడ్పీ హైస్కూల్‌లో 130 మందికి, గురుకుల పాఠశాలలో 119 మందికి కేంద్రాలుగా కేటాయించారు. మండలంలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 మంది, జగన్నాథపురం ఉన్నత పాఠశాలకు చెందిన 25 మంది, పూసుగూడెం పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు పది కిలోమీటర్లు, పొగళ్లపల్లి హైస్కూల్‌కు చెందిన 46 మంది విద్యార్థులు 13 కి.మీ. ప్రయాణించి మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కాగా కమలాపురం, పొగళ్లపల్లి గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్సు సౌకర్యమే లేదు. జగన్నాథపురం, పూసుగూడెం గ్రామాలకు బస్సు ఉన్నా ఉదయం వేళ రాదు. దీంతో ఆ పాఠశాలల వారికీ ప్రైవేటు వాహనాలే శరణ్యం.
లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక, మైలారం ప్రాంతాల నుంచి రేగళ్ల లేదా కొత్తగూడెం వచ్చి పరీక్ష రాయాల్సి ఉండగా వారు 15 కి.మీ. మేర ప్రయాణించాల్సి ఉంటుంది.
అశ్వారావుపేట, అశ్వాపురం, టేకులపల్లి మండలాల్లోనూ కొన్నిచోట్ల ఇదే సమస్య ఎదురవుతోంది.