ఐటీడీఏ పీఓ రాహుల్
భధ్రాచలం: భద్రాచలం వచ్చే పర్యాటకులు, భక్తులకు కనువిందు చేసేలా గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన బోటింగ్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు, మ్యూజియం లోపల పెయింటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాల పెయింటింగ్‌లతో పాటు గిరిజన వంటకాల స్టాళ్ల నిర్మాణం తదితర పనులు శనివారం లోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీరామనవమికి వచ్చే భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, ఏసీఎంఓ రమణయ్య, డీఈ హరీష్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, ఏఈ రవి, పంచాయతీ ఈఓ శ్రీనివాస్, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి
బూర్గంపాడు: విద్యార్థులు, అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందించాలని పీఓ రాహుల్ రెవెన్యూ అధికారులకు సూచించారు. బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ఎలా చేస్తున్నారని తహసీల్దార్ ముజాహిద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. యువతకు రాజీవ్ యువ వికాసం పథకంతో ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ సిబ్బందిని రీచ్‌ల వద్ద ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా దుస్తుల సరఫరాకు టెండర్ల ఆహ్వానం
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని క్రీడా పాఠశాలలకు దుస్తుల (టీ షర్ట్, షార్ట్, ట్రాక్ షూట్) సరఫరాకు సీల్డ్ షార్ట్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్‌లో పాల్గొనే వారు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఆసక్తి గలవారు గురువారం నుంచి ఈనెల 24 వరకు ఐటీడీఏ కార్యాలయంలో టెండర్ షెడ్యూళ్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1000 ఐటీడీఏ భద్రాచలం పేరుతో ఎస్‌బీఐ భద్రాచలం బ్రాంచ్‌లో చెల్లుబాటు అయ్యేలా డీడీ సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ధరావత్ సొమ్ము రూ.లక్ష డీడీ, టెండర్ షెడ్యూల్‌ను బాక్స్‌లో వేస్తే 24వ తేదీ మధ్యాహ్నం హాజరైన వారి సమక్షంలో బాక్స్ తెరిచి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.