పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉందని, ప్రజలపక్షం వహించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మంగళవారం ఆయన జగదల్‌పూర్ నుంచి కొత్తగూడెం మీదుగా విజయవాడ వెళ్తూ.. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషాతో చర్చించారు. అనంతరం రాజా మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే ప్రజాపోరాటాలకు రాష్ట్రంలోనే ఈ జిల్లా అదర్శంగా నిలుస్తోందని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతోమంది జాతీయ స్థాయి నాయకులను అందించిందని, ప్రజావాణి వినిపించే నేతలను చట్ట సభలకు పంపిందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లాలో పార్టీ విస్తరణకు, ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తుండడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది సకాలంలో సభ్యత్వాలు పూర్తి చేసిన జిల్లా నాయకత్వాన్ని అభినందించారు. సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణ పాండే తదితరులు ఉన్నారు.