సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోడు పట్టాలు పొందిన రైతుల సాగుకు వీలుగా నీటి వసతి కల్పించాలని, ఈ మేరకు విద్యుత్, అటవీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో తగిన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యుత్ లైన్లు సాధ్యం కాని పక్షంలో అటవీ శాఖ అధికారుల ఆమోదంతో బావులు తవ్వి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పోడు భూముల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్ తవ్వకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని, నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయ శాఖ అధికారుపై చర్య తప్పదని హెచ్చరించారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా పంచాయతీ పరిధిలోని ప్రతీ కార్యాలయం, పాఠశాలలు, రోడ్డు పక్కన ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వు ఎక్కడా కనిపించడం లేదని, ఆమొక్కలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీల్లో ఇప్ప, కరక్కాయ, చింత, విషముష్టి, కుంకుడు, తంగేడు వంటి మొక్కలు పెంచాలన్నారు. గింజలు సేకరించే విద్యార్థులకు గ్రామస్థాయిలో రూ. 1,000, మండల స్థాయిలో రూ 5,000, జిల్లాస్థాయిలో రూ 50,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వీసీలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఏడీఆర్‌డీఓ రవి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు అనసూర్య, ఇందిర, మిషన్ భగీరథ అధికారి నళిని పాల్గొన్నారు.
పిల్లల కలలకు రూపం ఇవ్వండి
కొత్తగూడెంఅర్బన్: పిల్లల కలలు, ఊహా శక్తికి సరైన ప్రోత్సాహం అందిస్తే వారి భవిష్యత్ బంగారుమయం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా స్థాయి బాలమేళా ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తీసుకున్న ఈ వినూత్న కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయమన్నారు. పిల్లల అభ్యసన అభివృద్ధికి ఉపాధ్యాయులు అద్భుత కృషి చేశారని అభినందించారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 23 పాఠశాలలను, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పది మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఐదుగురు ఎంఈఓలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో వినూత్నంగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి నోట్ పుస్తకాల ప్రాజెక్టు విజయవంతంలో కీలక పాత్ర పోషించిన 15 మంది ఆర్పీలను కూడా సత్కరించారు. అనంతరం టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పాఠశాల విద్యార్థుల ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీంతో స్పందించిన కలెక్టర్ వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సతీష్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం