● 100 పడకల ఆస్పత్రి, ఐటీఐ నిర్మాణాలు ● పూబెల్లిలో 90 ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన ● నేడు మంత్రి పొంగులేటి రాక
ఇల్లెందు: పట్టణంలో ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. జేకే ఏరియాలో సింగరేణి క్వార్టర్లను కూల్చి పట్టణ నడిబొడ్డున 100 పడకల ఆస్పత్రితో పాటు ఐటీఐ నిర్మించనుండగా ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పైలాన్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. అనంతరం కోటిలింగాల క్రాస్ రోడ్ నుంచి మామిడి గుండాల వరకు రోడ్డు, రొంపేడు – రామగుండాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, మాణిక్యారం – కొమరారం – బోయితండా రోడ్డు పనులను ప్రారంభించనున్నారు. పోలారం పంచాయతీ ఇరుపవారి గుంపు – భద్రుతండా రోడ్డుకు. అనంతరం పూబెల్లిలో 90 ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఐటీఐతో నిరుద్యోగులకు మేలు..
ఇల్లెందులో ఐటీఐ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగనుంది. ఇందులో ఐదు ట్రేడ్‌లు నెలకొల్ప నుండగా ఒక్కో ట్రేడ్‌లో 40 మంది విద్యార్ధులకు అవకాశం కల్పిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా ఇప్పటికే ప్రిన్సిపాల్‌ను కూడా నియమించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదా వైటీసీలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంతకాలం డబ్బు చెల్లించి ఐటీఐ చేసే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఫీజుల భారం తప్పనుంది. ఎలక్ట్రీషియన్ కోర్సులో 2 యూనిట్లలో 40 మంది, ఫిట్టర్ రెండు యూనిట్లలో 40 మంది, ఐఓటీ స్మార్ట్ అగ్రికల్చర్ ఏడాది కోర్సుకు రెండు యూనిట్లలో 40 మంది, ఫ్యాషన్ డిజైనర్ టెక్నాలజీ రెండు యూనిట్లలో 40 మంది, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సు రెండు యూనిట్లలో 40 మంది చొప్పున విద్యార్థులకు తరగతులు బోధించనున్నారు.
ఆస్పత్రిలో పురోగతి ఇలా...
ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌లోకి మారిన తర్వాత డాక్టర్లు, సిబ్బంది సంఖ్య పెరిగింది. పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 12 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇక 100 పడకల ఆస్పత్రిగా మారితే సుమారు 30 మంది వైద్యులు, 60 మంది నర్సులు, 40 మంది ఇతర సిబ్బంది పనిచేసే అవకాశం ఉంది.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఇల్లెందురూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఇల్లెందులో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఇల్లెందు మండలం పూబెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇల్లెందు జేకే బస్టాండ్ వద్ద 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి, అనంతరం బోయితండాలో బీటీ రోడ్డు, రొంపేడులో చెక్‌పోస్టు, కోటిలింగాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి బయలుదేరి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభలో పాల్గొనేందుకు మంత్రి పొంగులేటి బయలుదేరతారు.


