భద్రాచలంఅర్బన్: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి టీ–హబ్ సెంటర్ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈనెల 17న ఉన్నతాధికారుల బృందం ఆస్పత్రిని సందర్శించి అవసరమైన పరికరాలు, ఇతర అంశాలపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వస్తే రక్త నమూనాలు సేకరించి కొత్తగూడెంలోని టీ–హబ్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చాక చికిత్స ప్రారంభిస్తుండడంతో జాప్యం జరుగుతోంది. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే టీ–హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా విధులు నిర్వర్తించిన గౌతమ్ పొట్రు భద్రాచలం ఆస్పత్రిలో టీ–హబ్ కేంద్రం ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
క్షయ నిర్ధారణా ఇక్కడే...
ఇటీవల భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని క్షయ నిర్ధారణ పరీక్ష యంత్రాలను జిల్లా కేంద్రంలోని టీ– హబ్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇంతలోనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి టీ– హబ్ మంజూరైంది. దీంతో క్షయ నిర్ధారణ పరికరాల తరలింపు కూడా నిలిచిపోనుంది. ఫలితంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు క్షయ వ్యాధి నిర్ధారణకు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇక్కట్లు తీరనున్నాయి.