నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలి | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలి

Published Wed, Oct 11 2023 8:20 AM

- - Sakshi

కొత్తగూడెం: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున పటిష్ట పర్యవేక్షణ జరగాలని అన్నారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, సీ – విజిల్‌ యాప్‌నకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా రూట్‌ మ్యాప్‌లు, సమస్యాత్మక ప్రాంతాలకు మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే సమీప పోలీస్‌స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు. లైసెన్స్‌డ్‌ పిస్టళ్లను పోలీస్‌ శాఖకు సరెండర్‌ చేయాలని, లేదంటే రద్దుచేస్తామని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లకు అనుమతిలేదని చెప్పారు.

నగదుతో రవాణా చేసే వారు తగిన ఆధారాలు చూపించకుంటే సీజ్‌ చేస్తామని తెలిపారు. ఆ నగదు విడుదలకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఉంటుందని, పరిశీలన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని, తప్పుడు సమాచారంతో పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌, డీఎఫ్‌ఓ కిష్టగౌడ్‌, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్‌రాజు, డీఆర్‌ఓ రవీంద్రనాథ్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నోడల్‌ అధికారుల నియామకం
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులను నియమించినట్లు ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున నోడల్‌ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌కు నోడల్‌ అధికారులు(ఎన్‌ఓ)గా డీఈఓ వెంకటాచారి, ఇరిగేషన్‌ డిప్యూటీ ఎస్‌ఈ కె. మహేశ్వరరావు, కోఆర్డినేటర్‌గా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు వ్యవహరిస్తారని తెలిపారు.

ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌ఓగా సీపీఓ శ్రీనివాసరావు, కోఆర్డినేటింగ్‌, మాస్టర్‌ ట్రైనర్లుగా డీఈఓ కార్యాలయ ఏపీఓ కిరణ్‌కుమార్‌, పి సాయికృష్ణ వ్యవహరిస్తారని, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌ఓగా భూగర్భ జల శాఖాధికారి ఎం.బాలు కోఆర్డినేటింగ్‌ అధికారిగా డీఏఓ అభిమన్యుడు ఉంటారని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ఎన్‌ఓగా ఎంవీఐ జైపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ఆర్‌టీఓ పి.వేణు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డీఎంలు వ్యవహరిస్తారు.

కంప్యూటరైజేషన్‌, సైబర్‌ సెక్యూరిటీకి ఎన్‌ఓగా డీఐ సీహెచ్‌ సంపత్‌, స్వీప్‌ ఎన్‌ఓగా సివిల్‌ సప్లై డీఎం త్రినాథ్‌బాబు, కో ఆర్డినేటర్‌గా డీఆర్డీఓ మధుసూదన్‌రాజు ఉంటారు. ఈవీఎం మేనేజ్‌మెంట్‌ ఎన్‌ఓగా అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు వ్యవహరిస్తారు. ఎంసీసీ ఎన్‌ఓగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, కో ఆర్డినేటర్లుగా సీఈఓ విద్యాలత, డీఎల్‌పీఓ పవన్‌ ఉంటారని కలెక్టర్‌ వివరించారు.

Advertisement
Advertisement