ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సూచన
చుంచుపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని, పార్టీలకతీతంగా అందరికీ సమ న్యాయం చేయాలని కలెక్టర్ అంకిత్ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. ఈనెల 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాలు, పట్టణాల్లో అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను గుర్తించాలని, అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ముందుగా ఆయన తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ అక్రమంగా నిల్వ చేస్తే చర్య తప్పదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో సాగుభూమి వివరాలు, ప్రస్తుత సాగు పరిస్థితులు, ప్రధాన పంటలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. సాగునీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ రైతులకు సకాలంలో నీరందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్యాస్ నిల్వలు, రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే అధిక మొత్తంలో బుకింగ్ చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, గ్యాస్ కొరత లేదనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గ్యాస్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏఓ బాబూరావు, పౌర సరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్, మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరిగేషన్ ఈఈ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.


