‘పది’కి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పది’కి సన్నద్ధం

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

● రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ● 73 కేంద్రాలు.. 13,141 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ● సందేహాల నివృత్తికి కంట్రోల్‌ రూమ్‌ అన్ని ఏర్పాట్లు చేశాం

● రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ● 73 కేంద్రాలు.. 13,141 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ● సందేహాల నివృత్తికి కంట్రోల్‌ రూమ్‌

కొత్తగూడెంఅర్బన్‌ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 12,731 రెగ్యులర్‌, 410 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 73 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఏడుగురు అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 73 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఐదుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 832 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యార్థులకు చల్లటి తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఏమైనా సందేహాలుంటే 99666 00678 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఐదు నిమిషాల వరకు గడువు..

పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత ఐదు నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. అయితే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి టెన్షన్‌ లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు చెబుతున్నారు. కాగా, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ప్రతీ కేంద్రం వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేయనున్నారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయిస్తారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్టాన్రిక్‌ వస్తువులకు అనుమతి లేదని ఇప్పటికే వెల్లడించారు. పరీక్షలకు ముందే హాల్‌ టికెట్లు తీసుకోవాలని, ఏదైనా పాఠశాలలో సంబంధిత యాజమాన్యాలు హాల్‌ టికెట్‌ ఇవ్వకుంటే ఫిర్యాదు చేయొచ్చని, లేదంటే వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా అనుమతిస్తామని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వైపూ సకాలంలో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

నెల రోజుల పాటు పరీక్షలు..

గతంలో మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఉండనుంది. విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, శ్రద్ధగా చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు రావాలని చెబుతున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు సైతం ఇటీవల టీ – శాట్‌ ద్వారా పరీక్షలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కాగా, గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు ఽధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 14వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష సమయానికి అనుకూలంగా బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేశాం. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి.

– నాగలక్ష్మి, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement