అందరి బంధువుకు ఆదరణేది? | - | Sakshi
Sakshi News home page

అందరి బంధువుకు ఆదరణేది?

Mar 13 2026 7:54 AM | Updated on Mar 13 2026 7:54 AM

పుష్కరాలు వస్తేనే చేపడుతున్న పనులు..

పన్నెండేళ్లకు ఓసారి మాత్రమే అవకాశం

సమర్థ కన్సల్టెన్సీకి అప్పగించాలని భక్తుల డిమాండ్‌

పుష్కరాలు వస్తేనే..

పదేళ్ల వెనుకబాటు తనం

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల వద్ద మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రూ. వందల కోట్లతో అభివృద్ధి చేశారు. వేములవాడలోనూ పనులు మొదలయ్యాయి. వరంగల్‌ వేయిస్తంభాల గుడి ప్రాంగణం విశాలంగా మారింది. రామప్ప ఆలయం ఏకంగా ప్రపంచ స్థాయి యునెస్కో గుర్తింపు దక్కించుకుంది. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని రాబోయే 200 ఏళ్లకు తగ్గట్టుగా గద్దెల ప్రాంగణాన్ని పునఃనిర్మించారు. రోడ్లు విస్తరించడంతో పాటు హోటళ్లు నిర్మించి కూడళ్లను అందంగా మార్చారు. జంపన్నవాగులో ఏడాది పొడవునా నీరుండేలా చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా ఎదురైన స్థల సమస్య, పోలవరం ముంపు కారణంగా గత పదేళ్లుగా భద్రాచలంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ జరగలేదు. ఆఖరికి పావన గోదావరి తీరంలో భక్తులు స్నానాలు ఆచరించే స్థలానికి ఎగువన నదిలో కలిసే మురుగునీరు కూడా మళ్లించలేని దుస్థితి ఇక్కడ నెలకొంది.

కన్సల్టెన్సీ కావాల్సిందే..

రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంలో చేపట్టే అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మరి రాకరాక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో దేవాదాయ శాఖ ఏ మేరకు సఫలం అవుతుందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఎప్పటిలాగే భక్తుల సౌకర్యం పేరుతో షెడ్ల నిర్మాణం, కల్యాణకట్ట విస్తరణ, పిండప్రదానం గదులు అంటూ సాధారణ ప్రతిపాదనలతోనే సరిపెడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. బాసర టు భద్రాచలం వరకు చేపట్టే పనుల్లో రాజీ పడేది లేదని సర్కారు పదేపదే ప్రకటిస్తోంది. అందుకు తగ్గట్టే రాష్ట్రంలోనే పుష్కరాలకు సంబంధించిన నంబర్‌ వన్‌ స్థానంలో ఉండే భద్రాచలంలో చేపట్టబోయే పనులు గేమ్‌ చేంజర్‌లా ఉండాలని భక్తులు ఆశిస్తున్నారు. ఆ మేరకు ఈ రంగంలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీలకు పుష్కర ప్రతిపాదనల రూపకల్పన పనులు అప్పగించాలనే డిమాండ్‌ వస్తోంది. ఇప్పటికే ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ కోసం నియమించిన కన్సల్టెన్సీ గతంలో రిలీజ్‌ చేసిన ఆలయ నమూనా వివరాలు వైరల్‌గా మారిన వైనాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. అలా కాకుండా సాదాసీదా ప్రతిపాదనలతో సరిపెడితే మళ్లీ ఈ అవకాశం కోసం మరో పన్నెండేళ్ల వరకు వేచి చూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అభివృద్ధికి నోచుకోని భద్రగిరి

భద్రాచలం అంటే గుర్తొచ్చేది ముందుగా శ్రీరామనవమి, ముక్కోటి పర్వదినాలు. ఇటీవల హనుమాన్‌ జయంతికి కూడా భక్తకోటి పోటెత్తుతోంది. ఆ రోజుల్లో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే, ఒకటి రెండు రోజుల కోసమే తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు తప్పితే శాశ్వత పనులేమీ ఇక్కడ జరగడం లేదు. అప్పుడప్పుడూ అరకొరగా మిథిలా స్టేడియం, చిత్రకూట మండపం పేరుతో నిర్మాణాలు జరిగినా సాంకేతిక లోపాలు, నిర్వహణ పరమైన నిర్లక్ష్యంతో ఈ రెండూ సామాన్య భక్తులకు అంతగా ఉపయోగపడడం లేదు. పర్వదినాల్లో కిక్కిరిసిపోయే భక్తులు సర్దుకుపోయేందుకే ఇవి ఉపకరిస్తున్నాయి. వందేళ్ల చరిత్రను బయటకు తవ్వి తీసినా 2003, 2015 గోదావరి పుష్కరాల సందర్భాల్లోనే చెప్పుకోదగిన, నేటికీ భక్తులకు, భద్రాద్రి వాసులకు ఉపయోగపడే రీతిలో పనులు జరిగాయి. మళ్లీ 2027 జూలైలో పుష్కరాలు వస్తేనే భద్రాచలంలో అభివృద్ధి పనులకు, మాస్టర్‌ ప్లాన్‌కు మోక్షం లభిస్తుందనే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement