‘స్వచ్ఛ’తకు సన్నాహాలు.. | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’తకు సన్నాహాలు..

Mar 28 2023 12:18 AM | Updated on Mar 28 2023 12:18 AM

మురుగునీటిని శుద్ధి చేస్తే ప్లాంట్‌  - Sakshi

మురుగునీటిని శుద్ధి చేస్తే ప్లాంట్‌

● మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ● స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద ఏర్పాటుకు రంగం సిద్ధం ● ప్రతిపాదనలు పంపిన కమిషనర్లు ● ఇల్లెందులో ఇప్పటికే అందుబాటులో..

మణుగూరుటౌన్‌: పర్యావరణ పరిరక్షణ, ప్రజా రోగ్యం కోసం పట్టణాల్లో వెలువడే మురుగునీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎస్‌టీపీ)ల అవసరం ఎంతైనా ఉంది. మున్సిపాలిటీల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతుండగా, డ్రెయినేజీల్లో మురుగు నీరు కూడా అదే రీతిలో వెలువడుతోంది. అయితే ఈ నీటిని శుద్ధి చేసి, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం మున్సి పాలిటీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విడతలో రాష్ట్రంలోని 104 మున్సిపాలిటీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జిల్లాలో నాలుగు మున్సి పాలిటీలు ఉండగా.. ఇల్లెందులో మాత్రమే మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో ఈ కేంద్రాలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వెలువడే మురికి నీటిని వాగులు, కాలువల్లోకి వదలడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

స్లమ్‌ ఏరియాలుగా పట్టణాలు..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు మూడు పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేవు. దీంతో మురిగునీటి ప్రవాహంతో వీధులు స్లమ్‌ ఏరియాలుగా మారుతున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 20 వేల నివాస గృహాలు, 90 వేల మంది జనాభా ఉన్నారు. నిత్యం 2.80 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు వెలువడుతుంటాయి. పాల్వంచలో 18 వేల ఇళ్లు, 85 వేల జనాభా ఉండగా రోజుకు 2.50 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు బయటకు వస్తున్నాయి. మణుగూరులో 8 వేల నివాస గృహాలు, 50 వేల జనాభా ఉండగా రోజుకు 1.80 మిలియన్‌ లీటర్ల వ్యర్థ నీరు వస్తుంటుంది. ఇదంతా సెప్టిక్‌ ట్యాంకుల్లో, సైడ్‌ డ్రెయిన్లలో కలిసి పోవడం వల్ల ప్రధాన రహదారుల్లో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

స్వచ్ఛభారత్‌ మిషన్‌తో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రాష్ట్రంలోని 104 మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు మున్సిపల్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 404 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు రూ.935 కోట్ల వ్యయంతో ఎస్‌టీపీల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.471 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.464 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

మురుగు శుద్ధితో ప్రయోజనాలెన్నో..

మురుగు శుద్ధి కేంద్రాలతో మున్సిపాలిటీ ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యర్థ జలాల ను నేరుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలోకి పంపడంతో దుర్వాసన దూరం కావడంతో ప్రజారోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. శుద్ధి కేంద్రాల్లోని వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్‌ ఎరువులు తయారుచేసి వివిధ పంటలకు వినియోగించవచ్చు. శుద్ధి చేసిన నీటిని వ్యవసాయ అవసరాలకూ వాడుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలు చేకూరే శుద్ధి కేంద్రాలను జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేయాలని ఆయా పట్టణాల వారు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

మున్సిపాలిటీల్లో మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఎస్టీపీ ఏర్పాటు చేయాలంటే పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మురుగునీటిని సేకరించి శుద్ధి చేయడం మరో పద్ధతి. రెండో పద్ధతిలో మురుగుశుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేస్తోంది.

– జి. రఘు, కొత్తగూడెం మున్సిపల్‌ కమిషనర్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement