ప్రైవేట్ వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ అభ్యర్థి
పట్నంబజారు: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల ప్రచురణలో ప్రైవేట్ వెబ్‌సైట్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున 11వ డివిజన్‌కు పోటీ చేసిన షేక్ లియాఖత్‌అలీ లాలాపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తప్పుడు ఫలితాలను ప్రచురించి, అనంతరం వాటిని మార్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే... గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి వైఎస్సార్ సీపీ అధికారిక అభ్యర్థిగా పార్టీ బీ–ఫారం ద్వారా పోటీ చేసిన తాను, ఎన్నికల ఫలితాల విషయంలో ప్రైవేట్ వెబ్‌సైట్ నిర్వాహకుల తప్పుడు ప్రచారానికి బలయ్యానని లియాఖత్ అలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 1న పోలింగ్, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగ్గా, ‘మై కార్పొరేటర్ డాట్ ఇన్’ వెబ్‌సైట్‌తో పాటు మరికొన్ని వెబ్‌సైట్లలో తనను తొలుత మొదటిస్థానంలో ఉన్న అభ్యర్థిగా, ఆ తర్వాత విజేతగా ప్రకటించారని తెలిపారు. వెబ్‌సైట్లలో ప్రచురితమైన సమాచారాన్ని నిజమని నమ్మిన తాను, తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించుకున్నామని వివరించారు. అయితే అధికారిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను మార్చడంతో అసలు వివాదం మొదలైందన్నారు. ఈ పరిణామంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. తప్పుడు ఎన్నికల ఫలితాల ప్రచారం కారణంగా తన వ్యక్తిగత ప్రతిష్టకు, రాజకీయ విశ్వసనీయతకు తీవ్ర భంగం కలిగిందని, మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు వెబ్‌సైట్‌లో తప్పుడు ఫలితాలను ఎవరు ప్రచురించారు? ఏ ఆధారాలతో వాటిని వెల్లడించారు? అనంతరం ఎందుకు మార్చారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వెబ్‌సైట్ యజమానులు, నిర్వాహకులు, ఫలితాలను అప్‌లోడ్ చేసిన వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు ఫలితాల ప్రచురణ వెనుక ఉన్న కారణాలను వెలికితీయడంతో పాటు, తనకు జరిగిన పరువు నష్టానికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్, 11వ వార్డు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా పంపించినట్లు తెలిపారు.


