తాడికొండ సబ్‌ స్టేషన్‌ను పరిశీలించిన జేసీ | - | Sakshi
Sakshi News home page

తాడికొండ సబ్‌ స్టేషన్‌ను పరిశీలించిన జేసీ

Nov 16 2026 1:32 AM | Updated on Nov 16 2026 1:32 AM

తాడికొండ: తుఫాన్‌ నేపధ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తాడికొండ సబ్‌స్టేషన్‌ని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ పరిశీలించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మురసు తుఫాన్‌ సమయంలో సబ్‌స్టేషన్‌లోకి వరద నీరు చేరిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి వరద ముంపు నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట విద్యుత్‌ అధికారులు, సబ్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కొండవీడుకు

కొత్త ‘రేసింగ్‌’ క్రేజ్‌

యడ్లపాడు: పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం తొలిసారిగా రేసింగ్‌ వేదికగా కొత్త అవతారం ఎత్తింది. మోటోస్ట్రోమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వెర్టెక్స్‌ హిల్‌క్‌లైంబ్‌ రేస్‌–2026 ఆదివారం కార్ల పోటీలతో ఉత్కంఠభరితంగా ముగిసింది.

తొలిరోజు బైకుల జోరు..

రెండో రోజు కార్ల హోరు

రెండు రోజుల పాటు సాగిన స్పీడ్‌వార్‌లో తొలిరోజు బైక్‌ రైడర్లు తమ ప్రతిభను చాటుకోగా, రెండోరోజు కార్‌ రేసర్లు రోడ్డుపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లారు. ఒక్కో విభాగంలో 20 రకాల పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, చైన్నె, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బైక్‌ రైడర్లు, 40 మంది కార్‌ రేసర్లు పాల్గొన్నారు.

కొండవీడుకు అంతర్జాతీయ క్రీడా గుర్తింపే లక్ష్యం

గతంలో కుప్పం, పెనుకొండ ప్రాంతాల్లో మోటార్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లను విజయ వంతంగా నిర్వహించిన మోటోస్ట్రోమ్‌..ఈసారి కొండవీడును వేదికగా ఎంచుకుంది. చారిత్రక ప్రాధాన్యం, ప్రకృతి అందాలు, సవాళ్లతో కూడిన ఘాట్‌ రోడ్డు ఈ పోటీలకు అనువైన వేదికగా నిలిచాయని నిర్వాహకుడు ఎం.నాగచైతన్య తెలిపారు. ఈ తరహా పోటీల ద్వారా కొండవీడును రేసింగ్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

భద్రతకు పెద్దపీట..

అనుమతుల జాప్యంపై అసంతృప్తి

పోటీల నిర్వహణలో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌సీఐ సర్టిఫికెట్‌ కలిగిన ప్రొఫెషనల్‌ రేసర్లకు మాత్రమే అవకాశం కల్పించామని వెల్లడించారు. ప్రమాదాల నివారణలో భాగంగా సందర్శకుల వాహనాలను అటవీశాఖ చెక్‌పోస్టు వరకే అనుమతించి, కొండపైకి పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు వెల్లడించారు. ఘాట్‌రోడ్డులో పోటీల నిర్వహణకు అనుమతులు ఆలస్యంగా లభించడంతో ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

మహిళల ఆత్మగౌరవంపై దాడి హేయమైన చర్య

సత్తెనపల్లి: మహిళల ఆత్మగౌరవంపై ట్విట్టర్‌ వేదికగా (ఎక్స్‌) రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకర, అవమానకర పదజాలంతో దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి అన్నారు. ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌ సీపీ మహిళలపై అనుచిత పోస్టులపై సత్తెనపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రాజశేఖర్‌కు లిఖిత పూర్వకంగా ఆదివారం ఫిర్యాదు అందించారు. ఆ పోస్టులను పెన్‌ డ్రైవ్‌లో కాపీ చేసి ఫిర్యాదుతో పాటు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సుధీర్‌భార్గవ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా సంయమనం పాటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వైవాహిక జీవితం గురించి ఎక్కడా మాట్లాడవద్దని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆదేశాల మేరకు తమ పార్టీ శ్రేణులు ఎంతో సంయమనం పాటించారన్నారు. అయితే ఐటీడీపీ ప్రోత్సాహంతో కొందరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో పాటు సినీనటులు అల్లు అర్జున్‌ సతీమణి, జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లి, సతీమణిలను నీచంగా మాట్లాడటం దారుణమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సంయమనం పాటించిన విషయాన్ని జీర్ణించుకోలేని ఐటీడీపీ వారు ఎలాగైనా హింసను ప్రేరేపించే విధంగా వైఎస్సార్‌ సీపీ మహిళలపై అసభ్యకరమైన పోస్టులను పెట్టారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తిరుగు రశీదు అడిగితే ఇవ్వటం కుదరదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ గీతహాసంతి, నాయకులు షేక్‌ మౌలాలి, చల్లంచర్ల సాంబశివరావు, కళ్ల విజయభాస్కరరెడ్డి, మర్రి వెంకటసుబ్బారెడ్డి, షేక్‌ మాబూహుస్సేన్‌, తుమ్మల వెంకటేశ్వరరావు, చిన్నం మణి బాబు, ఎం.ఏడుకొండలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement