బాపట్ల మున్సిపాల్టీ నామినేషన్లలో దూకుడు పెంచిన వైఎస్సార్ సీపీ
ఇప్పటికే చైర్మన్, పలువురు కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే కూటమి స్వతంత్రంగా అభ్యర్థులను బరిలో దించుతానంటూ బీజేపీ నేత ‘అన్నం’ హెచ్చరికలు
వేరు కుంపటికై నా సిద్ధం!
బాపట్ల: జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచింది. ఇప్పటికే చైర్మన్ అభ్యర్థితోపాటు మరో 10 మంది కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చైర్మన్ అభ్యర్థిగా కాగిత సుధీర్‌బాబు(యజ్రయ్య) శనివారం తొలి రోజు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు వెళ్లి నామినేషన్ వేశారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీకి దిగేందుకు అనేకులు ముందుకు వస్తుండగా.. కూటమిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈసారికి మమ్మల్ని వదిలేయమంటూ.. మరొకర్ని చూసుకోమంటూ ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. ఒక పక్కన స్వతంత్ర అభ్యర్థులు పోరుకు సిద్ధమవ్వగా, మరోవైపు కూటమిలోనే బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ తన టీంను సిద్ధం చేయటంతో బాపట్లలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కూటమికి ‘అన్నం’ షాక్
బాపట్ల మున్సిపల్ చైర్మన్ సీటును ఈ దఫా కూటమి బీజేపీకి కేటాయించింది. బీజేపీలో కూడా సునీల్ ఇస్కా అనే వ్యక్తికి టికెట్ ఇస్తారని ఆపార్టీలో జోరుగా చర్చలు సాగాయి. ఈమేరకు శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బాపట్లలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి మున్సిపల్ అభ్యర్ధిపై చర్చ కొనసాగించారు. అయితే ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్‌తోపాటు ఆయన వర్గీయులు సమావేశానికి హాజరుకాకపోవటం, అక్కడ పాల్గొన్న నాయకులు కూడా ఏకాభిప్రాయానికి రాకపోవటంతో సమావేశంలో అభ్యర్ధిని ప్రకటించకుండా వెనుదిరిగారు.
వైఎస్సార్ సీపీ దూకుడు మంత్రం
వైఎస్సార్ సీపీ నేతలు మొదటి నుంచి ఒక పథకం ప్రకారం ముందుకు సాగిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన పార్టీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ కాగిత సుధీర్‌బాబు(యజ్రయ్య)కు అవకాశం కల్పిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు 44 వార్డులకు సంబంధించి పార్టీ కోసం కష్టపడిన వారికి తొలి ప్రాధాన్యతగా అభ్యర్థులను నియమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ప్రచార అస్త్రాలుగా వైఎస్సార్ సీపీ ముందుకు దూసుకుపోతుంది. పట్టణ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకోవటం, మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.550కోట్లు విడుదల చేయటంతోపాటు రూ.150కోట్లకుపైగా ఖర్చుచేసి పనులు చేపట్టడమే ప్రధాన అంజెడా ముందుకుపోతున్నారు.
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీష్‌ప్రభాకర్ తాను స్థానికేతరులకు చైర్మన్ టికెట్ ఇస్తే తాను మున్సిపా ల్టీలోని 44 వార్డులకు అభ్యర్థులను బరిలోకి దించి పోటీకి సిద్ధమని ప్రకటించారు. అవసరమైతే పార్టీతోనైనా విభేదాలకు సిద్ధమని ఆయన ప్రకటించటంతో ఆపార్టీలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇక కూటమిలోని జనసేన, తెలుగుదేశంలోని సీనియర్లు అన్నంకు వ్యతిరేకంగా కూటమి తరఫున పోటీ చేసేందుకు జంకుతున్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.


