ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగానికి సహకరించాలి ఏదో చేసేద్దాంలే అనుకుంటే బాపట్లలో కుదరదు ప్రజలకు ఏ మేలు చేసిందో కూడా చెప్పుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి వ్యతిరేక ఓటింగ్ మళ్లింపు యత్నం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులుగా అందరిపైనా బాధ్యత ఉంటుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల అంటే ప్రశాంత వాతావరణానికి మారుపేరని తెలిపారు. ఏవో కొద్దిపాటి చిన్న సమస్యలు తప్పితే, ఎన్నికల్లో ఎప్పుడూ పెద్ద వివాదాలు జరిగిన సందర్భాలు లేవన్నారు. అయితే, బాపట్లలో ఏదో చేద్దామన్న విధంగా ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం సాగుతోందన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు అడగాలే కానీ, దొడ్డిదారిలో అందలాలు ఎక్కాలని చూడకూడదన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బాపట్ల మండలంలో వైఎస్సార్ సీపీకి ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారో చూస్తేనే అధికార పార్టీపై ప్రజలకు ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు.
అందుకే స్వతంత్ర అభ్యర్థులు పోటీ
ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ప్రతిపక్షాలకు రాకుండా చేసేందుకే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి మూడేళ్లు కావస్తున్నా, తాము ఇది చేశామని చెప్పుకొనే పరిస్థితి దానికి లేదన్నారు. ఓట్లు అడిగేటప్పుడు కూడా తమ విధివిధానాలను చెప్పుకోలేకపోయారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారన్నారు. ఆడబిడ్డ నిధి అంటూ నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని కోన ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. కచ్చితంగా బాపట్ల మున్సిపాలిటీని వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఏదో హడావిడి చేయాలని చూస్తే, కచ్చితంగా వీడియోలతో సహా నిరూపించి, తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో చైర్మన్ అభ్యర్థి కాగిత సుధీర్ బాబు, కౌన్సిలర్ అభ్యర్థులు రామిరెడ్డి, చల్లా రామయ్య, బూర్ల అనిల్ కుమార్, నాయకులు మణిభూషణం, ఊరబిండు, గోపి తదితరులు పాల్గొన్నారు.


