సముద్రుడికి హారతులిచ్చిన భక్తజనం శివనామస్మరణతో మార్మోగిన సాగర తీరం
బాపట్ల: ఓ వైపు వెన్నెల వెలుగులు.. మరోవైపు కార్తిక దీపాల కాంతులు.. అలల హోరులో ఆధ్యాత్మిక నాదాలు.. భక్తుల శివనామస్మరణతో సూర్యలంక సాగర తీరం పులకించిపోయింది. తెల్లవారుజాము నుంచే సూర్యలంకకు భక్తుల రాక ప్రారంభమైంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించారు. తర్వాత దీపాలను వెలిగించారు. సముద్రుడికి హారతులిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తీరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్నారు. శివనామస్మరణలు, భక్తిగీతాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌ల పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. భక్తులకు తాగునీరు, పులిహోర పంపిణీ చేశారు.


