త్రికోటేశ్వర స్వామికి కార్తిక పౌర్ణమి పూజలు ట్రాఫిక్ జామ్‌లతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు
నరసరావుపేట రూరల్: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. త్రికోటేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు, ధ్యానశివుడు, మహానందీశ్వరుడి విగ్రహం వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. దీంతో ఆ ప్రాంతం నూతన శోభను సంతరించుకుంది. సోపాన మార్గంలో మెట్ల పూజలు చేసుకుంటూ భక్తులు కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేశారు. ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు వినియోగించే లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. భక్తులను కొండపైకి చేరవేసేందుకు నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. కార్లు, ద్విచక్రవాహనాలతో కొండపై పార్కింగ్ ప్రాంతం నిండిపోయింది. పలు సేవా సంస్థలు భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశాయి. ఉదయం నుంచి పలుమార్లు ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఘాట్‌రోడ్డుపై కొండకు చేరుకునే ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు గంటపాటు భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పవిత్ర కార్తికమాసంలో పౌర్ణమి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో కోటప్పకొండ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సోపాన మార్గం ప్రారంభంలోని విఘ్నేశ్వరుడి ఆలయం వద్ద నుంచి భక్తులు గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆ మార్గం నిండిపోయింది.


