కొరిటెపాడు(గుంటూరు): నూతన పరిశ్రమల స్థాపన, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అండగా నిలుస్తోందని ఆ బ్యాంక్ విజయవాడ జోన్ జనరల్ మేనేజర్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ కట్టా శ్రీధర్‌బాబు తెలిపారు. గుంటూరు జీటీ రోడ్‌లోని యూబీఐ జోనల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ హ్యాండ్‌హోల్డింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ దరఖాస్తుల ప్రక్రియలో, వ్యాపారాభివృద్ధిలో అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అర్హతలు, బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా రుణ సదుపాయాలను పొందేందుకు ఎంఎస్‌ఎంఈ హ్యాండ్‌హోల్డింగ్ సెంటర్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ సమస్యలు, రుణ ప్రతిపాదనలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులు తగిన సూచనలు అందించారు. అనంతరం ఎనిమిది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూబీఐ రీజినల్ హెడ్ హనుమంత్‌రెడ్డి, ఏజీఎం హనుమంతరావు, ఎల్‌డీఎం మహిపాల్‌రెడ్డి, అశోక్, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక యువత, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో ఎంఎస్‌ఎంఈ హ్యాండ్ హోల్డింగ్ కార్యక్రమం


