తెనాలి: గుంటూరుకు చెందిన శ్రీకేఆర్‌కేఎం మెమోరియల్ అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మ క, సాంస్కృతిక కమి షన్ సౌజన్యంతో ఈ నెల 23, 24 తేదీ ల్లో ‘అమరావతి నృత్యోత్సవం– 2026’ నిర్వహిస్తున్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని అన్నమయ్య కళావేదికపై సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ నృత్యోత్సవంలో నృత్యగురు ప్రీతి మహాపాత్రో(ఒడిస్సీ నృత్యం), లోకా చంద్రశేఖర్‌రెడ్డి(ఆంధ్రనాట్యం), చెరుకుఅనుష్క(భరతనాట్యం)తోపాటు తెనాలికి చెందిన నృత్యగురువు చల్లా వేదవల్లి, మహతి భిక్షు(కూచిపూడి) నృత్య ప్రదర్శనలున్నాయి. ప్రముఖ నర్తకి, అకాడెమీ కార్యదర్శి కోకా విజయలక్ష్మి ఈ కార్యక్రమ రూపకల్పన చేశారు. తెనాలి కళాకారిణుల పరిచయం.
కూచిపూడి నృత్యంలో 39 ఏళ్ల అనుభవం కలిగిన నర్తకి, కొరియోగ్రాఫర్, నృత్యగురు చల్లా(జంధ్యాల) వేదవల్లి స్వస్థలం కళల కాణాచి తెనాలి. చిన్నతనంలో కాళ్లకు గజ్జెలు కట్టిన వేదవల్లి, తొలుత చదలవాడ నారాయణరావు, తర్వాత నాట్యాచార్య ఎండీ గిరి దగ్గర శిక్షణ తీసుకున్నారు. కళనే ప్రియంగా పదనర్తనాన్నే శ్వాసగా మలుచుకుని ‘కూచిపూడి’ని వంటపట్టించుకొన్నారు. అభినయ సౌదామినిగా కీర్తిని పొందారు.
దేశంలోని ప్రతిష్టాత్మక వేదికలపై ప్రదర్శనలిచ్చారు. 1996లో ముంబయిలో హేమమాలిని, శోభానాయుడు, రాధా రాజారెడ్డి, వెంపటి రవిశంకర్ వంటి నాట్యదిగ్గజాలు నర్తించిన వేదికపై గజ్జె కట్టారు. విశ్వామిత్ర– మేనక, రతీమన్మధ, చెంచులక్ష్మి, మోహినీభస్మాసుర, అభిజ్ఞాన శకుంతలము వంటి నృత్యరూపకాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1993లో అకాడమీ ఆఫ్ ఇండియన్ డ్యాన్సెస్(తిరుపతి) అఖిల భారత నృత్యపోటీల్లో కూచిపూడి, భరతనాగ్యం రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతి, మూడేళ్లకోసారి ఇచ్చే ‘సూపర్ డ్యాన్స్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. నృత్యసామ్రాజ్ఞి, నాట్యమయూరి, ముంబయిలో సింగారమణి.. వంటి అవార్డులెన్నో స్వీకరించారు. వివాహం తర్వాత భర్త ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉన్నారు. ‘నాట్యవేద’ నృత్యపాఠశాలను ఆరంభించి, ప్రవాస భారతీయుల పిల్లలకు నాట్యశిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు, నాట్యాంజలి ఉత్సవాలు, మామళ్లపురం నృత్యోత్సవం, కృష్ణా పుష్కరాలు, తిరుమలలో జరిగిన వేడుకల్లో శిష్యులతో సహా పాల్గొన్నారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ద్వారా అక్కడ జరిగిన ‘భారత్ మేళా’, భారత ప్రధాని పర్యటనలో ‘హలా మోదీ’ (2024)లో ఈవెంట్‌లోనూ నృత్యప్రదర్శనలిచ్చారు. మళ్లీ ఇప్పుడు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ, ఆన్‌లైన్‌లో నృత్య శిక్షణను కొనసాగిస్తున్నారు.
నాట్యం, నటశిక్షణ...మహతి భిక్షు...
తెనాలికి చెందిన నందిరాజు జ్ఞానేశ్వర్ భిక్షు కుమార్తె మహతి భిక్షు. నటుడిగా, నాటకకర్తగా, సంగీత దర్శకుడిగా, అధ్యాపకుడిగా, నటశిక్షకుడిగా విలువైన సేవలందించిన భిక్షు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. ఆయన సతీమణి అరుణ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఆ యూనివర్సిటీ నృత్యవిభాగానికి అధిపతిగా ఉన్నారు. ప్రముఖ నర్తకి అయిన అరుణ, ఎన్నో నృత్యరూపకాలను ప్రదర్శించారు. భిక్షు దంపతుల కుమార్తె మహతి. తల్లిదండ్రులకు తగ్గ తనయగా గుర్తింపు సాధించారు. తల్లిలాగే కూచిపూడి, సంప్రదాయ నృత్యాలను నేర్చుకున్నా రు. నటనపై ఆసక్తితో 2019లో కన్నడ సినిమా ‘హాంగోవర్’లో నటించారు. తర్వాత జార్జిరెడ్డి, రాధేశ్యామ్, కిన్నెరసాని చిత్రాల్లో నటించారు. తర్వాత అవకాశాలు వస్తున్నా, నటశిక్షణపై దృష్టిని కేంద్రీకరించారు. ‘భిక్షూస్ హౌస్ ఆఫ్ ఆర్ట్’ పేరుతో ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతూ కొత్త నటీనటులకు శిక్షణనిస్తున్నారు. ‘సింగ్ గీతం’ సినిమా హీరో అయాన్‌కు, ‘ఇట్లు అర్జున’తో పరిచయమైన అరీష్‌రెడ్డి, ‘డాన్‌బాస్కో’ హీరోయిన్‌కు శిక్షణనిచ్చారు. మహేశ్‌బాబు కుమార్తె సితారకు మహతి శిక్షణనిచ్చారు.
నృత్య ఆహార్యంలో చల్లా వేదవల్లి, మహతి భిక్షు


