లంకెవానిదిబ్బ ఎంపీటీసీ సెగ్మెంట్‌లో దుశ్చర్య
రేపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేపల్లె మండలం లంకెవానిదిబ్బ ఎంపీటీసీ సెగ్మెంట్‌లో నామినేషన్ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్ సీపీ తరఫున తన భార్య విశ్వనాథపల్లి ముత్యాలమ్మను ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సిద్ధమైన తన వద్ద నుంచి నామినేషన్ పత్రాలు, సెల్‌ఫోను, నగదును కొందరు బలవంతంగా లాక్కెళ్లినట్లు భర్త వీరరాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన రేపల్లె పట్టణ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. శుక్రవారం నామినేషను దాఖలు చేయాల్సి ఉండటంతో అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కోసం వీర రాఘవయ్య గురువారం రేపల్లె పట్టణానికి వచ్చారు. ఓ జిరాక్స్ కేంద్రంలో పత్రాలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అక్కడికి వచ్చి తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. నామినేషను పత్రాలతో పాటు సెల్‌ఫోను, నగదును బలవంతంగా లాక్కొని, తనపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
ఎంపీపీ అభ్యర్థి వర్గం పనే...
ఈ ఘటన వెనుక టీడీపీ మండల ఎంపీపీ అభ్యర్థి కోప్పనాతి రాజశేఖర్ ఉన్నట్లు వీర రాఘవయ్య ఆరోపించారు. రాజశేఖర్ వర్గానికి చెందిన కోప్పనాతి బాబురావు, కోప్పనాతి వెంకటేశ్వరరావు తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ముత్యాలమ్మ తరఫున శుక్రవారం నామినేషను దాఖలు చేయాల్సి ఉందని వీర రాఘవయ్య తెలిపారు. అధికారులు తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నామినేషన్ సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


