కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలు పరిశీలన
చీరాల: ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈనెల 28న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని జయంతిపేటలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 41,43 నెంబర్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఓటర్లు సులభంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాను ప్రదర్శించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి కల్పించే సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఓటరట్ల రాకపోకలకు అనుకూలమైన సౌకర్యాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయం, పోలింగ్ కేంద్రాల వారీగా నిర్వహణ సన్నద్ధత తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ కె.నరసింహారావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.


