దుగ్గిరాల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ భర్త
అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తాం:
పార్టీ సమన్వయకర్త వేణుగోపాలసోమిరెడ్డి
ఓటమి భయంతోనే అరెస్ట్ అంటున్న: అరుణ
తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ నాయకుడు దాసరి వీరయ్యను పీడీ యాక్టు కింద మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటలకు కుంచనపల్లిలోని నివాసం నుంచి బలవంతంగా తాడేపల్లి పోలీసులు తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వీరయ్య భార్య అరుణ, అడ్వకేట్లు దేవరకొండ రామకృష్ణ, బాజీగంగాధర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులను నాయకులు నిలదీయగా రాజమండ్రి తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దుగ్గిరాల మండలం ఎస్సీ రిజర్వేషన్ నేపథ్యంలో వైఎస్సార్ సీపీని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పీడీ యాక్ట్ దుర్మార్గం..
మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. దుగ్గిరాల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వేణుగోపాల సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాల రోజే దాసరి వీరయ్యపై తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం ప్రారంభించిందని ఆరోపించారు. ఎటువంటి సంబంధం లేని కేసుల్లో వీరయ్యను ఇరికించి జైలుకు పంపించారని పేర్కొన్నారు. వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం వీరయ్యపై పీడీ యాక్ట్ దుర్మార్గం అన్నారు. న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
కేసులన్నీ అక్రమమే..
దాసరి వీరయ్య భార్య అరుణ మాట్లాడుతూ బుడంపాడు హత్య కేసుతో పాటు ఇతర కేసులన్నీ అక్రమంగా పెట్టినవేనని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అత్తగారు పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని, ఎన్నికల్లో తమ కుటుంబాన్ని అడ్డుకోవడానికే తన భర్తను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ తన భర్తను విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ సీపీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉందని తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అరెస్టులు, బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూడడం సరికాదని విమర్శించారు.
అడ్వకేట్ దేవరకొండ రామకృష్ణ మాట్లాడుతూ దాసరి వీరయ్యపై గతంలో నమోదైన కేసులను ఆధారంగా చేసుకుని పీడీ యాక్ట్ అమలు చేశారని అన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి గోరేబాబు, పెరికలపూడి మాజీ సర్పంచి గంపల గంగాధర్, నాయకులు రమేష్ పాల్గొన్నారు.


