చీరాల: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి, 44 వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ బాబు బీ ఫాంలను అందించారు. బుధవారం స్థానిక రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టామన్నారు. చీరాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. వార్డుల అభివృద్ధికి ఆనాడు ఎంతో కట్టుబడి ఉన్నామన్నారు. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కులు వంటి అభివృద్ధి పథకాలను నిర్వహించామన్నారు. పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఇస్తర్ల షెర్లికి బీ ఫాం అందించారు. అనంతరం వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు ఆయన బి ఫాంలను అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


