ఆరు వాహనాలు స్వాధీనం
చీరాల: చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస స్కూటీ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను బుధవారం ఒన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా దండుబాట రోడ్డు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అనుమానాస్పదంగా వస్తూ పోలీసులను చూసి వెనుతిరిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వారు ఇంకొల్లు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న స్కూటీని పరిశీలించగా అది ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ప్రధానంగా స్కూటీలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వెంటనే విక్రయిస్తే దొరికిపోతామని భయంతో దాచి ఉంచుతున్నామన్నారు. కొత్తపాలెం సమీపంలో జగనన్న కాలనీ వద్ద ఉన్న ఓ పాడుబడిన రేకుల ఇంట్లో ఈ వాహనాలను ఉంచామన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో దాచి ఉంచిన ఆరు స్కూటీలను సీజ్ చేశారు. ఈ వాహనాలను ఏయే ప్రాంతాల్లో దొంగలించారనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ జట్టు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): నవంబర్ 14 నుంచి 16 వరకు తెలంగాలోని సదాశివపేటలోని జరిగే 20వ జాతీయ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని గుంటూరు జిల్లా జట్టును ఎంపిక చేసామని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 13 ఉదయం 7 గంటలకు సదాశివపేటలోని వాక్స్‌సేన్ యూనివర్సిటీలో టీం మేనేజర్ సిహెచ్‌వి రాజుకు రిపోర్ట్ చేయాలని కోరారు.
ఎంపికై న క్రీడాకారుల వివరాలు
అండర్ 14 బాలురు విభాగం: ఎస్‌వీ ఫృద్వీ, టీవీ తిరుమూర్తులు, బాలికల విభాగంలో.. ఎస్‌కె రీసా, ఎస్ కృతిలయ, అండర్ 16 బాలికల విభాగంలో– పి హేమశ్రీ, కె.హన్విత, జి దీపిక, శ్రీలక్ష్మీ పావని, బి కీర్తి, జి దీక్ష శ్రీ, బాలుర విభాగం– పి సిద్ధిక్, ఎస్‌కె ముంజమల్, వై భార్గవ్, టీం కోచ్ కె.రవి, మేనేజర్‌గా సిహెచ్.వి.రాజు వ్యవహరిస్తారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సుప్రీం చెంపపెట్టు..
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నెలకొన్న అక్రమాలపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు చంద్రబాబు నాయుడుకు, కూటమి నేతలకు చెంపపెట్టులాంటిదని గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరగడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.


