సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

బాపట్ల: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీస్‌ బలగాలను నియమించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఏఏఎల్‌ పద్మావతి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై నోడల్‌ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చీరాల, బాపట్ల మున్సిపాలిటీలలో పర్యటించి, పరిశీలించిన అంశాలపై అనుభవాలను అధికారులకు వివరించారు. రూపొందించుకున్న ప్రణాళికను చక్కగా అమలు చేస్తే, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ దిశగా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేశారు. ఓటర్లను అభ్యర్థులు ప్రభావితం చేయకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వైలెన్‌న్స్‌ బృందాలు పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జి.కృష్ణప్రియ తెలిపారు. వీడియోగ్రఫీ సర్వేలను బృందాలు మరింత చురుగ్గా పని చేయాల్సి ఉందన్నారు. మున్సిపాలిటీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. నవంబర్‌ మూడో తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్‌ 26వ తేదీన పంచాయతీల మొదటి దశ, నవంబర్‌ 29వ తేదీన పంచాయతీలకు రెండో దశ, డిసెంబర్‌ రెండో తేదీన మూడో దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. 1,092 పోలింగ్‌ కేంద్రాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3,770 పోలింగ్‌ కేంద్రాలలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి 10,576 మంది ఉద్యోగులను నియమించామని కలెక్టర్‌ చెప్పారు. మున్సిపాలిటీలకు రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రెండు స్టాటిక్‌ సర్వైలెనన్స్‌ బృందాలు, రెండు జోనల్‌ అధికారుల బృందాలను నియమించామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం 216 మందిని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు, 216 మందిని స్టాటిక్‌ సర్వైలెనన్స్‌ బృందాలు నియమించగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయన్నారు. 54 మందిని జోనల్‌ అధికారులుగా నియమించామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ చెప్పారు. నామినేషన్‌ ప్రక్రియ జరిగే ప్రాంతాలలో మూడంచెల భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, డీపీఓ టి నగేష్‌ కుమారి, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement