అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిషేధం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నిర్వాహకులు, వారి ప్రతినిధులు బహిరంగ సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్పీ స్పష్టం చేశారు. మైకులు, లౌడ్‌స్పీకర్లు లేదా డ్రోన్ కెమెరాలను వినియోగించాలన్నా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా కర్రలు, ఆయుధాలు, ఇతర ప్రమాదకర వస్తువులను వెంట తీసుకెళ్లడం, నలుగురు, అంతకంటే ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా గుమిగూడటం నిషేధమని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కమ్యూనిటీ నాయకులు, ప్రజలు పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే పోలీస్ అధికారులకు, 112 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


