మంగళగిరి టౌన్: మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ‘మిషన్ మోడ్’లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా సూచించినట్లు ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్(ఎ.ఎన్.టి.ఎఫ్) చీఫ్స్ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ పాల్గొన్నట్లు ఏపీ ఈగల్ రాష్ట్ర కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణ, నివారణ, ఎన్‌ఫోర్స్‌మెంట్, యువత రక్షణ, పునరావాసం, ఆధునిక సాంకేతిక వినియోగంపై ఆకే రవికృష్ణ సదస్సులో వివరించారు. డ్రోన్లతో గంజాయి సాగుపై నిఘా, మెడికల్ షాపులపై నిఘా ఉంచి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
తాడేపల్లి రూరల్: బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరుస్తున్న వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయి కుమార్‌ను మంత్రి ఎస్.సవిత అభినందించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మార్కాపురంలో నిర్వహించిన 11వ ఏపీ స్టేట్ సబ్‌జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సాయి కుమార్ బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించాడు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయి కుమార్, కోచ్ జూనా నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ వై.రమేశ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 3 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయ సబ్‌జూనియర్స్ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంటున్నట్లు సాయి కుమార్ వివరించాడు. ఈ సందర్భంగా మంత్రి సవిత సాయి కుమార్‌కు కొత్త దుస్తులు అందజేసి సత్కరించారు.
నరసరావుపేట: వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. వినుకొండ రోడ్డులోని వీవీఆర్ మండలంలో బుధవారం సాయంత్రం పల్నాడు సర్కిల్‌పై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక నష్టాలను, ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. వందశాతం రెవెన్యూ వసూళ్లను సాధించాలని కోరారు. విద్యుత్ చౌర్యం జరగకుండా ప్రతి ఇంటికి మీటరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, ఎస్‌ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్, మాచర్ల, నర్సరావుపేట ఈఈలు, టెక్నికల్ ఈఈలు, ఆపరేషన్ ఏఈలు హాజరయ్యారు.
దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు 3,007 క్యూసెక్కులు విడుదల చేశారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కు 126 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 759 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 154, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 960 క్యూసెక్కులు వదులుతున్నారు.


