గుంటూరు వెస్ట్‌లో కొండలా పేరుకుపోయిన ఈఆర్ఓ పెండెన్సీ ఓటర్ల ఫొటోల పరిశీలనలో వెస్ట్ ఈఆర్ఓ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న 22,115 దరఖాస్తులు జిల్లా సగటు ఈఆర్ఓ పెండెన్సీ 4.04శాతం.. ఒక్క వెస్ట్‌లోనే ఏకంగా 20.68శాతం ఈస్ట్‌లోనూ 4,763 దరఖాస్తులు పెండింగ్ బీఎల్ఓలు కష్టపడుతున్నా..ఈఆర్ఓల వద్దే ఆగుతున్న వైనం
ఉద్దేశపూర్వక జాప్యమా?
నెహ్రూనగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫొటోల పరిశీలన, ఆమోదం విషయంలో గుంటూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నగర నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమ పరిధిలో అధికారులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన పూర్తి చేసి పంపించినా, ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా వేలాది దరఖాస్తులను పెండింగ్‌లో పడేశారు.
ఒక్క వెస్ట్‌లోనే 20 శాతానికి పైగా పెండింగ్!
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొత్తం 38,054 దరఖాస్తులు ఈఆర్ఓల పరిశీలనలో పెండింగ్‌లో ఉండగా, ఇందులో సగానికి పైగా ఒక్క గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం.
గుంటూరు నగరం పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లోనే కలిపి దాదాపు 26,878 దరఖాస్తులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇతర ప్రాంతాల్లో చురుగ్గా..
గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఈఆర్ఓ పెండెన్సీ చాలా తక్కువగా ఉంది.
ఓటరు జాబితా ప్రక్షాళన, సరిదిద్దే ప్రక్రియలో ఈ స్థాయిలో జాప్యం జరగడంపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన ఓటర్ల మార్పులు – చేర్పులు, సరైన ఫొటోల నమోదును సకాలంలో ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రజలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


