గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు సిబ్బంది బుధవారం వర్షంలోనూ లెక్కచేయకుండా తమ నిరసన తెలిపారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని మౌనంగా కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు తెలిపారు.
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో బుధవారం ఎల్ నినో నేపథ్యం లో రబీ 2026–27 పంటల ప్రణాళిక కార్యచరణ సమావేశంను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ మాట్లాడుతు క్షేత్రస్థాయిలో ప్రస్తుత యదార్థ పరిస్థితులను అంచనావేసి ఎల్ నినో నేపథ్యంలో రబీ 2026–27 పంటల ప్రణాళిక కార్యచరణ చేయాలని సూచించారు. ఖరీఫ్‌లో పంట వేయని విస్తీర్ణం, రబీలో సాధారణ పంట విస్తీర్ణంను దృష్టిలోఉంచుకొని ఆచరించగలిగిన సలహాలు, కొలవదగిన, పరిమాణాత్మక ఫలితాలను సాధించే దిశగా ప్రణాళికా రచన చేయాలని నిర్దేశించారు. నీటి బడ్జెటింగ్, నేలలో తేమ సూచిక, మార్కెట్ డిమాండ్ ఈ సారి చలికాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుని వ్యూహరచన చేయాలన్నారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి. సుమతి జిల్లాల వారిగా ప్రస్తుత పంట విస్తీర్ణం, వర్షపాతం, రబీలో విత్తుకోడానికి సిద్ధంగా ఉన్న విస్తీర్ణం వంటి అంశాలతో పాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను వివరించారు. వాసర్ ల్యాబ్స్‌కు చెందిన డాక్టర్ ఎన్‌డీఆర్‌కె శర్మ మాట్లాడుతూ ప్రణాళిక రచనలో అవసరమైన మండల స్థాయిలో వర్షపాతం, పంటలసాగువిస్తీర్ణం వంటి సమాచారాన్ని విశ్వవిద్యాలయం అందిస్తామన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.రామచంద్రరావు, వ్యవసాయశాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల సహ పరిశోధన సంచాలకులు, వివిధ పరిశోధన శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు అనుభవజ్ఞులైన విశ్రాంత శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖకు కన్సల్టెన్సీ ఏజెన్సీలైన వాసర్ ల్యాబ్స్, అగ్రివాచ్ డెలాయిట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు రాష్ట్రంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు చంద్రమౌళినగర్‌లో ఆయన నివాసంలో బుధవారం మాట్లాడారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఐడీ అధికారుల ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, అయితే గతంలో బాధితులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు పాత జిల్లాల ప్రాతిపదికన 13 కేంద్రాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బాధితులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, తద్వారా వారిపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. కర్ణాటకలో కూడా సుమారు 8.50 లక్షల మంది బాధితులు ఉన్నారని, అక్కడ కూడా 4 కేంద్రాలకు బదులు 6 కేంద్రాలు, తెలంగాణలో 3 కేంద్రాలఉ బదులు 5 కేంద్రాలు, ఒడిశాలో 2కు బదులు 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆయా రాష్ట్రాల్లోని బాధితులకు సౌలభ్యంగా ఉంటుందని సూచించారు. న్యాయపర సమస్యలు తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కోర్టు వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. బాధితులకు చివరి పైసా వచ్చే వరకు అసోసియేషన్ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.


