మమ అనిపింఛన్‌..! | - | Sakshi
Sakshi News home page

మమ అనిపింఛన్‌..!

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

పింఛను దరఖాస్తుల పరిశీలన పేరిట కోతలు

గుంటూరు జిల్లాలో వేల దరఖాస్తుల తిరస్కరణ రెండేళ్ల నిరీక్షణ తర్వాత అవకాశమిచ్చినా.. దరఖాస్తుకు చాలీచాలని గడువు ఏదో ఒక సాకుతో 5,242 దరఖాస్తులు తిరస్కరణ కూటమి నేతల పెత్తనం.. అధికారుల వద్ద వాలిపోయిన ప్రైవేట్‌ వ్యక్తులు జిల్లావ్యాప్తంగా ఇంకా 15 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌ లబ్ధిదారుల ఆవేదన

జిల్లా సమాచారం

5 వేలకు

పైగా

తిరస్కరణ

నెహ్రూనగర్‌: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు, అర్హుల పరిశీలన ప్రక్రియ అర్హులైన పేదలకు శాపంగా మారింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, దరఖాస్తు చేసుకునేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చి చేతులు దులుపుకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కొద్ది సమయంలో అతికష్టమ్మీద అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తెచ్చుకుని, సమర్పించిన అర్జీలను సైతం అధికారులు ఏదో ఒక కొర్రి పెట్టి తిరస్కరిస్తున్నారని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిశీలనలో అధికార పార్టీ నేతల పెత్తనం నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు చెప్పినవారి దరఖాస్తులను మాత్రమే ముందుకు కదిలిస్తూ, అర్హులైన పేదల దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

నగరంలో మరీ దారుణం

గుంటూరు నగరంలో పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నగరంలో మొత్తం 16,482 దరఖాస్తులు ఉండగా, కేవలం 41.79 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 9,594 దరఖాస్తులు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. అలాగే పొన్నూరు అర్బన్‌లో 33 శాతానికి పైగా, మంగళగిరి – తాడేపల్లిలో 30 శాతానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ఇంకా 15,155 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత కూడా పేదలకు పింఛన్లు దక్కకుండా అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మకై ్క కొర్రీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెండింగ్‌లో ఉన్న 15,155 దరఖాస్తులను సక్రమంగా పరిష్కరిస్తారో..లేక ఏదో ఒక సాకు చూపి తిరస్కరిస్తారో అని భయాందోళనలో లబ్ధిదారులు ఉన్నారు.

మొత్తం దరఖాస్తులు: 57,539

పరిశీలన పూర్తయినవి: 42,384 (73.66శాతం)

ఇంకా పెండింగ్‌లో ఉన్నవి: 15,155

ఆమోదించినవి: 37,142

తిరస్కరించినవి: 5,242

గుంటూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 57,539 దరఖాస్తులు పరిశీలనకు రాగా, 22వ తేదీ నాటికి ఇందులో ఇప్పటివరకు ఏకంగా 5,242 దరఖాస్తులను తిరస్కరించడం గమనార్హం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పింఛన్ల తిరస్కరణ అధికంగా ఉంది. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోనే అత్యధికంగా 1,118 దరఖాస్తులను పక్కన పెట్టగా, తెనాలి అర్బన్‌లో 991 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత ఉన్నప్పటికీ ఏదో ఒక వంకతో నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగుల అర్జీలను తొలగించారని బాధితులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement